పూణె మే 16,
కొవిడ్ సోకిన ఓ వృద్ధురాలు చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. మరి కొన్ని నిమిషాల్లో ఆమె దహన సంస్కారాలు ముగిసేవే. కానీ ఆశ్చర్యరకంగా ఒక్కసారిగా ఆమె లేచి కూర్చునే సరికి కుటుంబ సభ్యులు సహా అందరికీ చెమటలు పట్టాయి. మహారాష్ట్ర పూణె జిల్లా బారామతిలోని ముదాలే గ్రామంలో జరిగిందీ ఘటన స్థానికంగా సంచలనమైంది. లేచి కూర్చున్న ఆమ మహిళ పేరు శకుంతల గైక్వాడ్. వయసు 76 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. అయినప్పటికీ ఆమె కోలుకోపోగా ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బారామతిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడామెకు బెడ్ దొరకకపోవడంతో కారులోనే ఉండి నిరీక్షించసాగారు. కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయి అచేతనంగా మారింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు గ్రామంలోని బంధువులకు విషయం చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని చెప్పి బయలుదేరారు. తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లలో మునిగిపోయారు. శకుంతల మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్మశానానికి తరలించేందుకు వృద్ధురాలిని పాడెపై ఉంచారు. అంతే.. ఒక్కసారిగా వృద్ధురాలు ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఇది చూసి ఒక్క క్షణం భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పాడెపై నుంచి లేపి ఆసుపత్రికి తరలించారు. శకుంతల ప్రస్తుతం బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.