YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పనులు పక్కదారి

పనులు పక్కదారి

కర్నూలు డివిజన్‌ పరిధిలో 2,600 నీరు-చెట్టు పనులను కేటాయించారు. వీటి విలువ రూ.250.66 కోట్లు. ఇప్పటివరకు 630 పనులు పూర్తిచేయగా... సుమారు రూ.54 కోట్లు బిల్లులు చేశారు. నంద్యాల పరిధిలో రూ.331 కోట్ల విలువైన 2,445 పనులు కేటాయించగా 812 పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.7.50 కోట్లు చెల్లింపులు జరిగాయి. ప్రస్తుతం 194 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

కేసీ కెనాల్‌ జిల్లాలో 220 కి.మీ. మేర ఉంది. ఇందులో కర్నూలు డివిజన్‌ పరిధిలో సుమారు 80 కి.మీ., నందికొట్కూరు-పాములపాడు నుంచి నంద్యాల డివిజన్‌ సూక్ష్మ నీటిపారుదల శాఖ పరిధిలో 140 కి.మీ. వరకు కేసీ కెనాల్‌ ప్రవహిస్తోంది. కేసీ కెనాల్‌లో వచ్చి కలిసే వాగులు-వంకలు తక్కువగా ఉంటాయి. సమీపంలోని పంట కాల్వలను వాగులుగా చూపిస్తూ నీరు-చెట్టు పథకంలో వెడల్పు చేశారు. పంట కాల్వలను వెడల్పు చేయడంతో స్థానిక రైతులకు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో రైతులు, కాంట్రాక్టర్ల మధ్య గొడవలు జరిగి కేసులు సైతం నమోదయ్యాయి. కర్నూలు, నంద్యాల రెండు డివిజన్ల పరిధిలోనూ ఇదే తంతు జరుగుతోంది.

రైతుల పంట పొలాలకు వెళ్లేందుకు ఆయకట్టు రోడ్లు నీరు-చెట్టు పథకం కింద ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి రహదారి 3 కి.మీ. పరిధితో చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో పనికి రూ.9 లక్షల వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. జిల్లాలోని కేసీ కెనాల్‌ పరిధిలో ఆయకట్టు రోడ్ల పేరుతో నిధుల స్వాహాకు తెర లేపారు. అర కి.మీ. నుంచి రెండు కి.మీ. వరకు రహదారులు వేసి కొందరు బిల్లులు చేస్తుండగా, మరికొందరు పనులే చేయకుండా బిల్లులు బొక్కేసేందుకు ప్రతిపాదనలు పంపారు. గడివేముల కేసీ పరిధిలో ఏకంగా 33 ఆయకట్టు రహదారులు చేపట్టడం ఇందుకు తార్కాణం. సోమాపురం-కొర్రపోలూరు మధ్యలో కేసీ ఆయకట్టు లేదు. అయినా ఆయకట్టు రోడ్డుగా చూపించి వర్క్‌ ఐడీ 13013204009 రూ.9.92 లక్షలకు బిల్లు ప్రతిపాదనలు పంపారు. విచిత్రమేమంటే ఇదివరకే ఈ శాశ్వత రహదారికి జడ్పీ, మండల పరిషత్‌, ఉపాధిహామీ నిధులతో మెటల్‌ రోడ్డు వేశారు. ఆ రోడ్డునే చూపించి బిల్లులు చేసేందుకు పావులు కదుపుతున్నారు.

నీరు-చెట్టు పనులు రెండో విడతలోనూ అక్రమాల జోరు తగ్గలేదు. వర్క్‌ ఆర్డర్‌ లేకుండానే చేపడుతున్నారు. మరికొన్ని పనులు పూర్తికాకుండానే బిల్లులు పెట్టారు. ఇంకొన్ని గతేడాది పనులకు ప్రస్తుతం బిల్లులు చేసేందుకు యత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కొలతలు తీయడం, ఎంబుక్‌ వంటివి ఏఈ స్థాయి అధికారులు, చెక్‌ మెజర్‌మెంట్‌ డీఈ స్థాయి అధికారులు చేయాల్సి ఉంది. వీళ్లంతా ఆమ్యామ్యాలతో గుత్తేదార్లకు సహకరిస్తున్నారు. నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేయకుండా ఒక్కో పనికి రూ.10 వేలు ధర నిర్ణయించి ముడుపులు తీసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఇక నాయకులకు 15-20 శాతం, అధికారులకు 10 శాతం, జీఎస్టీ వంటి పన్నులు చెల్లించి పనులు దక్కించుకున్నకాంట్రాక్టర్లు కనీసం 30 శాతం మిగుల్చుకోవడానికి చూస్తూ నీరు-చెట్టు పనుల్లో నాణ్యతను నీరుగారుస్తున్నారు.

Related Posts