YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతా ఇష్టారాజ్యం

అంతా ఇష్టారాజ్యం

 జిల్లాలో బంజరు భూములకు రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం పట్టాలు ఇచ్చేస్తున్నారు. చోటా నాయకులు, వివిధ పార్టీల వారే కాదు.. వారి కుటుంబాల్లో వేర్వేరు వ్యక్తుల పేరిట ఐదారు పట్టాలకు తక్కువ కాకుండా తీసేసుకున్నారు. అంతేనా.. వాటిని బ్యాంకుల్లో ఉంచి రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ లబ్ధీ పొందారు.. సర్కారు నుంచి వచ్చే రాయితీలూ సొంతం చేసుకుంటున్నారు. ఎంచక్కా లెక్కకు మిక్కిలి ప్రయోజనాలు పొందుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జిల్లాలోని పట్టాల పేరిట పెద్ద దందానే జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులకు అన్నీ తెలిసినా చోద్యం చూస్తున్నారు. వీరిలో కొందరికి కూడా ప్రతిసారి కొంత ముడుతోందనేది తేటతెల్లమవుతోంది. కంటికి కన్పించకుండానే వేర్వేరు రూపాల్లో రూ.కోట్లు కొందరి జేబుల్లోకి వెళ్తున్నాయి. 

జిల్లాలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వివిధ విడతల్లో భూ పంపిణీ జరిగింది. 2014 ఎన్నికలకు ముందు వరకు మొత్తం ఆరు విడతలుగా భూ పంపిణీ చేశారు. ప్రతి మండలంలోనూ పేద రైతులు పంటలు సాగు చేసుకునేందుకు డీకేటీ పట్టాలిచ్చారు. ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు, లేకపోతే అంత కంటే తక్కువ చొప్పున పట్టాలిచ్చారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ లేకపోయినా.. ప్రతి మండలంలో రెవెన్యూ అధికారులు ఎడాపెడా ఇప్పటికీ పట్టాలిస్తూనే ఉన్నారు. గతమైనా, ఇప్పుడైనా రెవెన్యూ అధికారులు ఇస్తున్న భూములు దాదాపుగా సాగుకి పనికి రానివే.

నాయకులు చెబితే చాలు.. చేతికి ఎముకలేదనే చందంగా రెవెన్యూ వారు ఎడాపెడా డీకేటీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. గత కాంగ్రెస్‌ హయాంలోనూ, ప్రస్తుతం ఇదే తంతు జరుగుతోంది. దీనిని ఆసరాగా తీసుకొని కొందరు ఎకరాలకు ఎకరాలు కూడబెట్టుకుంటున్నారు. చోటా నాయకులు, గ్రామ స్థాయి రెవెన్యూ సిబ్బంది, మరికొందరు తమ కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సోదరి, ఇంకా వారి  బంధువులు అందరి పేరిట ఐదేసి ఎకరాల చొప్పున ఒక్కో కుటుంబంలో 20-30 ఎకరాలు సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. నాయకులు, అధికారులు అంతా ఇందులో భాగస్వాములు కావడంతో ఎవరూ దీనిపై అభ్యంతరాలు చెప్పడం లేదు. ఆయా పార్టీలు, వివిధ సంఘాల నాయకులు కూడా అందినకాడికి పట్టాలు తీసుకుంటున్నారు. విచిత్రం ఏమంటే.. ఇలా పట్టాలు తీసుకున్న వారిలో అత్యధికులకు వారికి ఇచ్చిన భూములు ఎక్కడున్నాయనేది కూడా తెలియదు. అన్ని ప్రయోజనాలు దక్కుతుండటంతో ఆ భూముల కోసం తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదు.

కొండలు, గుట్టలు, ఏమాత్రం సాగుకు వీలులేని భూములకు పట్టాలిస్తున్న రెవెన్యూ అధికారులు, అదే స్థాయిలో వాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా జారీ చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో కూడా ఆయా సర్వే నంబర్లలో వీరికి భూమి ఇచ్చినట్లు నమోదు చేశారు. దీంతో ఆ భూముల పొందినోళ్లు పట్టాదారు పాసుపుస్తకాలు చూపించి బ్యాంకుల్లో, సహకార సొసైటీల్లో వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. సాధారణంగా వ్యవసాయ రుణం ఇచ్చేటపుడు అక్కడ పంటలు వేస్తున్నారా? లేదా? అనేది బ్యాంకు, సొసైటీల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. కానీ అదే లేకుండానే రుణాలిస్తున్నారు. ఇలా రుణాలు ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ భూముల్లో ఎక్కువ మంది వేరుసెనగ వేసినట్లు  చూపిస్తున్నారు. వేరుసెనగ సాగుకు ఎకరాకు రూ.20 వేల వరకు రుణం లభిస్తోంది. ఐదెకరాలు ఉంటే రూ.లక్ష వరకు రుణం వస్తోంది. అలాగే ఏటా పెట్టుబడి రాయితీ కింద గతంలో హెక్టారుకు రూ.10 వేలు ఇస్తుండగా, ఇపుడు రూ.15 వేలు చొప్పున ఇస్తున్నారు. ఇలా ఎన్నిరకాల ప్రయోజనాలు ఉంటాయో వాటిని అన్నింటినీ పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అసలు సాగు మాత్రం ఉండటం లేదు.

జిల్లాలో చాలా వరకు పట్టాలిచ్చిన డీకేటీ భూములు అసలు సాగుకు ఏమాత్రం యోగ్యంకానివని అన్ని స్థాయుల అధికారులకు తెలిసినా.. దీనిపై ఎవరూ తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తేనె తుట్టెను కదిపితే నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తాయనే ఉద్దేశంతో ఎవరూ వీటి జోలికి వెళ్లడం లేదు. వీరి అక్రమాలకు వెబ్‌ల్యాండ్‌ కూడా దోహదపడుతోంది. కొన్నిచోట్ల తహసీల్దార్ల సహకారంతోనే వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారం మార్పులు, చేర్పులు చేసేస్తున్నారు. బ్యాంకర్లు కూడా కేవలం వెల్‌ల్యాండ్‌లో ఆ భూముల వివరాలు, రైతు పేరు ఉందా? లేదా? అనేది మాత్రమే చూసి, క్షేత్రస్థాయిలో పంటలు వేశారా? లేదా? అనేది ఏమాత్రం పరిశీలించకుండా రుణాలు ఇచ్చి ఈ అక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.

ఆత్మకూరు మండలంలోని గొరిదిండ్ల రెవెన్యూ పరిధిలోని కొండలు, గుట్టల ప్రాంతమిది. వందల ఎకరాల ప్రభుత్వ, అటవీ శాఖ భూములు ఉన్నాయి. ఇక్కడ కూడా సాగు పేరిట గతంలో ఈ భూముల్లో చాలా వరకు పట్టాలిచ్చారు. నాయకులు ఆదేశించిందే తడవుగా అధికారులు ఈ ప్రాంతంలో భూములకు పట్టాలిచ్చారు. ఇక్కడ కూడా సాగుకు అవకాశం లేని భూములే ఎక్కువగా ఉన్నాయి.

Related Posts