YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చైనా-భారత్‌ సంబంధాలఫై కొత్త అధ్యాయానికి జిన్‌పింగ్‌ శ్రీకారం మోదీ, జిన్‌పింగ్‌ ఆత్మీయ సమావేశం

చైనా-భారత్‌ సంబంధాలఫై కొత్త అధ్యాయానికి జిన్‌పింగ్‌ శ్రీకారం       మోదీ, జిన్‌పింగ్‌ ఆత్మీయ సమావేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మనసు విప్పి మాట్లాడుకుందాం రమ్మంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానించడంతో మోదీ చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఇరువురు నేతల అనధికారిక చర్చలు కొనసాగాయి. ప్రఖ్యాత ఈస్ట్‌ లేక్‌ వద్ద ఇరువురు నేతలు నదీ తీరాన కాసేపు నడుచుకుంటూ మాట్లాడుకున్నారు. తేనీరు స్వీకరించారు. తర్వాత డబుల్‌ డెక్కర్‌ పడవలో మోదీ, జిన్‌పింగ్‌లు విహారం చేశారు. బోటులో కూర్చుని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు వారు పడవలో ప్రయాణించారు. బోటులో కూడా మోదీ, జిన్‌పింగ్‌ టీ తాగుతూ ముచ్చటించారు.చైనా అధ్యక్షుడితో అనధికార చర్చల్లో పాల్గొనడం గొప్ప అవకాశమని మోదీ అన్నారు. మోదీని అనధికారిక పర్యటనకు ఆహ్వానించి జిన్‌పింగ్‌ చైనా-భారత్‌ సంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మోదీ, జిన్‌పింగ్‌ల బోటు విహారం అనంతరం అతిథి గృహంలో భోజన ఏర్పాట్లు చేశారు. మోదీ, జిన్‌పింగ్‌ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత మోదీ భారత్‌కు బయలుదేరుతారు. డోక్లామ్‌ ప్రతిష్టంభన వల్ల ఏర్పడిన దూరాన్ని చెరిపేసి, పరస్పరం విశ్వాసాన్ని పెంచడానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నిన్న వుహాన్‌ నగరంలో మ్యూజియం సందర్శన 20 నిమిషాల్లో ముగియాల్సి ఉండగా 40 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మోదీ, జిన్‌పింగ్‌ల సమావేశం కూడా అరగంటలో ముగియాల్సి ఉండగా రెండు గంటల పాటు కొనసాగింది. దీంతో తీవ్రమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.మోదీ, జిన్‌పింగ్‌ అనధికారికంగా ఆత్మీయ సమావేశం కావడం ఇది రెండోసారి. 2014లో జిన్‌పింగ్‌ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇరువురు నేతలు ఇప్పటికి దాదాపు డజనుసార్లు వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై చర్చలు జరిపారు. మోదీ ప్రధాని అయ్యాక చైనాకు రావడం ఇది నాలుగోసారి. ఇప్పుడు జరుగుతున్న భేటీకి మాత్రం చాలా ప్రత్యేకత ఉందని, ఇది రెండు హృదయాల మధ్య, హార్ట్‌ టు హార్ట్‌) జరిగే సదస్సు అని అధికారులు పేర్కొన్నారు. మోదీ చైనా పర్యటనలో ఎలాంటి అధికారిక అజెండా లేదు. అధికారులు పాల్గొనరు. ఒప్పందాలూ ఉండవు.డోక్లాం కస్సుబుస్సులు కట్టిపెట్టి.. సరిహద్దుల రుసరుసలు కప్పిపెట్టి.. ఎత్తుకుపైఎత్తుల వ్యూహాలు పక్కనెట్టి.. ఒక ఆహ్లాద, ఆనంద, ఆత్మీయ సదస్సు! ఇరు హృదయాల సమ్మేళనం! భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కలిసి ఆలపించిన స్నేహ గీతం! ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని ప్రోదిచేసేందుకు చేతులు కలిపిన అపురూప క్షణం! అధికారులు ఎజెండాతో కాదు.. మనసులతో మాట్లాడుకుందాం! ఒకసారి రండి!అని అనూహ్యంగా చైనా పంపిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ శుక్రవారం చైనా చేరుకున్నారు. బీజింగ్‌ రాజకీయ రంగులకు, షాంఘై రణగొణ ధ్వనులకు దూరంగా.. విహార కేంద్రమైన హుబీ ప్రావిన్స్‌లోని వూహన్‌లో మోదీకి విడిది ఏర్పాటు చేశారు. అక్కడి హుబీ ప్రొవెన్షియల్‌ మ్యూజియం వద్ద మోదీకి ఎర్ర తివాచీ స్వాగతం లభించింది. తివాచీకి మరో చివర జిన్‌పింగ్‌ ఆయనకు ఆహ్వానం పలికారు. ఇరువురు నేతలు సుదీర్ఘ కరచాలనం చేసుకుంటూ.. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా మోదీ కొన్ని పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. 2015లో జియాన్‌లో మీరు నాకు స్వాగతం పలికారు. ఇప్పుడు... వూహన్‌లో! ఇలా చైనా రాజధాని బీజింగ్‌ వెలుపల రెండుసార్లు మీ స్వాగతం అందుకున్న తొలి భారత ప్రధానిని నేనే కావొచ్చు. భారతదేశ ప్రజలూ దీనిని గర్వంగా భావిస్తున్నారుఅని మోదీ తెలిపారు. ఔను అంటూ జిన్‌పింగ్‌ చిరునవ్వుతో బదులిచ్చారు. ఆ తర్వాత మోదీకి సంప్రదాయ స్వాగతం పలుకుతూ హుబీ ప్రొవెన్షియల్‌ మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సారూప్యత ఉందని... మన నాగరికతలు నదీ తీరాల్లోనే వెలిసి విలసిల్లాయని జిన్‌పింగ్‌కు మోదీ తెలిపారు. మొహంజదారో, హరప్పా నాగరికతల గురించి వివరించారు.మోదీ, జిన్‌పింగ్‌ కలిసి ప్రతినిధుల స్థాయిలో సౌహార్ద చర్చలు జరిపారు. రెండువేల సంవత్సరాల చరిత్రలో సుమారు 1600 ఏళ్లపాటు చైనా, భారత్‌లు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని... అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పట్టు కొనసాగించాయని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 50 శాతం వాటా భారత్‌-చైనాలదేనని తెలిపారు. ఇరుదేశాలు కలిస్తే ఇప్పుడు కూడా అద్భుతాలు సృష్టించవచ్చునని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు.భారత్, చైనా మధ్య బాంధవ్యాన్ని మరింత ముందుకు తీసుకెళదామని జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య అవగాహన పెరిగేలా ఈ తరహా సమావేశాలు మళ్లీ మళ్లీ జరగాలి. తద్వారా ఇరుదేశాల మన మధ్య బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లవచ్చుఅని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. దీంతో... వచ్చే ఏడాది భారత్‌లో ఆత్మీయ పర్యటన జరపాలని జిన్‌పింగ్‌ను మోదీ కోరారు.

Related Posts