ప్ర: సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు పట్టుకుంటారు? వారు ఏం బోధిస్తారు? ఏకదండి_ద్విదండి_త్రిదండి అంటే ఏమిటి?
జ: సన్యాసులు (స్వాములు) చేతిలో వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా పొడవాటి కర్రలు ఎళ్లవేళలా పట్టుకుంటారు. ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది.
గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. (దండి అనగా కర్ర అని అర్థము)
ఒక కర్రను (ఏకదండి ) ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు (ఆది శంకరాచార్యులు). అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బ్రతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్దాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.
రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు (మధ్వాచార్యులు). వీరిని 'ద్విదండి స్వాములు ', 'జీయరు'లని అంటారు వీరందరూ వైష్ణవ భక్తులే. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.
మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి ( త్రిదండి) భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతమును బోధిస్తారు (రామానుజాచార్యులు). శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యములని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,
జీవుడు ఆజ్ఞానముతో సంసార బంధమున చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారికి భగవంతుని అణుగ్రహం వలన అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము నారాయణ సాన్నిధ్యము, మోక్షము పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్దాంతాన్ని బోధిస్తారు.