హైద్రాబాద్, మే 19,
గోల్డ్ లోన్లను తీర్చడంలో బారోవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చలేక బ్యాంకుల వద్ద తనఖాగా పెట్టిన గోల్డ్‌ను వదిలేసుకుంటున్నారు. కరోనా వలన ఆర్థికంగా చితికిపోవడంతో సెంటిమెంట్ నగలను కూడా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి విడిపించుకోలేకపోతున్నారు. దీంతో తనఖాగా వచ్చిన గోల్డ్ జ్యువెలరీని వేలం వేయాలని లెండర్లు చూస్తున్నారు. కిందటేడాది గోల్డ్ ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రూ. 58 వేల వద్ద రికార్డ్ గరిష్టాలను తాకింది. ఆ టైమ్‌లో గోల్డ్ వాల్యూలో 90 శాతం వరకు లోన్ ఇచ్చేందుకు ఫైనాన్షియల్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఒకరితో ఒకరు పోటీ పడి మరి గోల్డ్ లోన్లను ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు గోల్డ్ ధరలు తగ్గడంతో బంగారంపై లోన్ తీసుకున్న వారు లోన్లలో కొంతైనా తీర్చాలని లేదా మరింత బంగారాన్ని తనఖాగా పెట్టాలని బారోవర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కరోనా వలన ఆదాయం తగ్గడం, మెడికల్ ఖర్చులు పెరగడంతో చాలా కుటుంబాలు తనఖాగా పెట్టిన గోల్డ్‌ను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్దే వదిలేస్తున్నాయి.గోల్డ్ లోన్లను మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా తీసుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది రోజువారి కూలీపై ఆధారపడి బతుకుతుంటారని, కరోనా వలన వీరి ఆదాయాలు పడిపోయాయని చెబుతున్నారు. కరోనా సంక్షోభం వలన కొంత మంది గోల్డ్ లోన్ బారోవర్లు తమ అప్పులను తీర్చలేకపోతున్నారని సీఎస్‌బీ బ్యాంక్ సీఈఓ సీవీఆర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సీఎస్‌బీ అడ్వాన్స్‌లలో గోల్డ్ లోన్ల వాటా 39.8 శాతంగా(రూ. 6,131 కోట్లు) ఉంది. కిందటేడాదితో పోలిస్తే 61 శాతం పెరిగింది. గోల్డ్ ధరలు పడిపోతుండడంతో మరింత బంగారాన్ని తనఖా పెట్టాలని లేదా లోన్ అమౌంట్‌లో ఎంతో కొంత తీర్చాలని బారోవర్లను డిమాండ్ చేస్తున్నారని రాజేంద్రన్ అన్నారు. ఒకవేళ అలా చేయలేకపోతే తనఖా బంగారాన్ని వేలం వేస్తామని నోటీస్‌లు ఇస్తున్నారని చెప్పారు. ‘వేలం నోటీస్‌లు ఇచ్చాక చాలా మంది బారోవర్లు తమ గోల్డ్ లోన్లను తీర్చడం గమనించాం. సెంటిమెంట్ నగలను విడిపించుకోవాలని చాలా మంది చూశారు’ అని పేర్కొన్నారు. గత కొన్ని వారాలను గమనిస్తే తనఖా నగలను వేలం వేస్తామనే నోటీస్‌లు న్యూస్ పేపర్లలో పెరిగాయని బ్లూమ్‌బర్గ్ క్వింట్ రిపోర్ట్ చేసింది.కరోనా ప్రభావాన్ని కుటుంబాలు, చిన్న వ్యాపారులు, ఎంటర్‌ప్రెన్యూర్లపై తగ్గించేందుకు ప్రభుత్వం గోల్డ్ వాల్యూలో ఇచ్చే మ్యాక్సిమమ్ లోన్ లిమిట్‌ను పెంచింది. ఈ నిర్ణయంతో గోల్డ్ లోన్లిచ్చేందుకు ఫైనాన్షియల్ సంస్థలు మరింతగా ముందుకొచ్చాయని చెప్పాలి. కిందటేడాది జూన్ నుంచి ఇతర సెగ్మెంట్లలో లోన్లివ్వడం తగ్గినా గోల్డ్ లోన్లు మాత్రం భారీగా పెరిగాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి బ్యాంకులు ఇచ్చిన గోల్డ్ లోన్లు 70 శాతం పెరిగి రూ. 56 వేల కోట్లకు టచ్ చేశాయని తెలిపింది. ‘ప్రస్తుతం గోల్డ్ వాల్యూలో 75–80 శాతం వరకు లోన్లివ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ముందు ఇది కేవలం 70 శాతం వరకు మాత్రమే ఉంది. గోల్డ్ ధరలు కిందటేడాది ఆగస్ట్ గరిష్టాల నుంచి 18–20 శాతం పడ్డాయి. దీంతో కొన్ని ఫైనాన్షియల్ సంస్థలకు అసెట్ క్వాలిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’ అని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ అన్నారు. బ్యాంకులు సెక్యూర్డ్ లోన్లకు ప్రయారిటీ ఇస్తున్నా, గోల్డ్ ధరలలో అనిశ్చితి, కరోనా సెకెండ్ వేవ్ వలన బ్యాంకుల అసెట్ క్వాలిటీ తగ్గుతోందని చెప్పారు. కిందటేడాది నేషనల్ లాక్‌డౌన్‌తో పోలిస్తే ఈ సారి కరోనా రిస్ట్రిక్షన్లు తక్కువగా ఉన్నాయని, ప్రజల ఆదాయాలపై తక్కువ ప్రభావం ఉంటుందని బ్యాంకర్లు అంచనావేస్తున్నారు.