YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీటి కోసం కోటి పాట్లు

నీటి కోసం కోటి పాట్లు

వేసపి ఎఫెక్ట్ తో పలు ప్రాంతాల్లో నీరు అడుగంటిపోయింది. తాగునీటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోనూ ఈ దుస్థితి నెలకొంది. అయితే ఇక్కడ జలవనరులు అడుగంటడం కంటే.. మానవ తప్పిదాల వల్లే నీటికి కటకట నెలకొందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రహదారి పనులు సాగినప్పుడు మంచి నీటి పైపులు దెబ్బతిన్నాయని, దీంతో పట్టణంలో పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా సాగడంలేదని చెప్తున్నారు. పలు ప్రాంతాల్లో పైపులు లీకవుతుండడంతో మంచినీరు నేలపాలవుతోందని వాపోతున్నారు. టెక్కలి పట్టణానికి నలువైపులా జరుగుతున్న రహదారి విస్తరణ పనులు తాగునీటి సరఫరాకు ప్రధాన ఆటంకంగా మారాయి. పాత జాతీయ రహదారి విస్తరణ పనులతో గత మూడు నెలలుగా వందలాది కుటుంబాలకు మంచినీరు సరిగా అందడంలేదు. టెక్కలి పట్టణంలో ఎక్కడికక్కడ పైపులైన్ల లీకేజీలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రధాన రహదారిలో ఎక్కడికక్కడ లీకేజీలతో నీటి సరఫరాకు చిక్కులు ఏర్పడుతున్నాయి.  దీంతో కనీసం ట్యాంకర్లతోనైనా నీరు అందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. 

తాగునీరు సరిగా అందడంలేదని టెక్కలి వాసులు ముక్తకంఠంతో చెప్తున్నారు. అయితే మేజరు పంచాయతీలో ఉన్న సిబ్బందితో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టి తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ప్రస్తుతం వివిధ కారణాలతో పాత పథకాల నుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని విడిభాగాలు తెప్పించి అన్ని పథకాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామని అన్నారు. త్వరలోనే అన్నిచోట్ల మరమ్మతులు జరిపించి మంటినీటి సరఫరాను పూర్తిస్థాయిలో జరిగేలా చూస్తామని చెప్తున్నారు. టెక్కలిలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులతో తాగునీటి సరఫరాలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కూడా అంగీకరించారు. ఇప్పటికే పలుచోట్ల పాడైన పైపులైన్లకు మరమ్మతులు జరిపించామని మరికొన్నిచోట్ల జరిపించాల్సి ఉందని వివరించారు. సత్వరమే సమస్యలను పరిష్కరించి టెక్కలి పట్టణమంతా మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related Posts