తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రధాన రహదారులు పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల గుంటలు పడితే.. మరికొన్నిచోట్ల తారు లేచిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణిస్తున్నవారు నరకం అనుభవిస్తున్నారు. తరచూ ప్రమాదాలు కూడా సంభవిస్తుండడంతో ప్రాణాలు అరచేత పట్టుకున్న ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. కొత్త రోడ్లు నిర్మించాలన్న డిమాండ్లు ఉన్నా నిధుల లేమి ఉందని అధికారులు చెప్తున్నారు. రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపుతున్నామని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాతే ఈ విషయమై ముందడుగు వేయగలమని వివరిస్తున్నారు. నగరం నుంచి పోర్టు మార్గంలో మూడు రోడ్లు ప్రధానంగా ఉన్నాయి. కార్గో రవాణాతో పాటు లారీలు, ఇతర వాహనాలు తిరిగేందుకు ఇవే ప్రధాన రహదారులుగా ఉన్నాయి. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో రోడ్లు నాణ్యంగా ఉండాలి. కానీ పాడైన రహదారుల మరమ్మతుల వ్యవహారమే సమస్యగా మారిందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది కొత్త రోడ్ల నిర్మాణం అంటే అత్యాశే అన్నట్లు మాట్లాడుతు్ననారు.
గతంలో ప్రధాన రోడ్ల నిర్మాణానికి కాకినాడ నగరపాలక సంస్థ ముందుకొచ్చినా ఆచరణసాధ్యం కాలేదు. నిధుల కొరతే దీనికి ప్రధాన కారణం. ఎనిమిదేళ్లుగా ఈ రోడ్లు నిర్వహణకు నోచుకోక పోవడంతో పూర్తిగా ఛిద్రమయ్యాయి. జగన్నాథపురం వంతెన నుంచి కాకినాడ యాంకరేజి పోర్టు వైపు ఉన్న రహదారి దారుణంగా దెబ్బతింది. దీనిపై భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. డెయిరీ ఫాం కూడలి నుంచి పర్లోపేట డంపింగ్ యార్డు మీదుగా పోర్టు వైపు వెళ్లే మరో రహదారి కస్టమ్స్ హౌస్ వద్ద ఒకటో నంబరు రోడ్డుకు అనుసంధానంగా ఉంది. ఇది కూడా అధ్వానంగా ఉంది. డెయిరీ ఫాం కూడలి నుంచి కుంభాభిషూకం వైపు వెళ్లే రోడ్డు సైతం గోతులమయంగా మారింది. ఈ రోడ్డు పలుచోట్ల గోతులు పడ్డాయి. మధ్యలో రైల్వే గేటు ఉండడం, ఇక్కడ వంతెన నిర్మాణాన్ని చేపట్టక పోవడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి కాకినాడలో అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారులను తక్షణమే బాగుచేయాలని అంతా కోరుతున్నారు.