YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బద్వేలు కు టీడీపీ దూరం

బద్వేలు కు టీడీపీ దూరం

కడప, మే 20, 
ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక రాబోతుంది. బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం. ఎన్నిక ఆరు నెలల్లోపు జరగాల్సి ఉంది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక జరగనుంది. అయితే జగన్ ఆ కుటుంబంలోని వారికే ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు. దీంతో బద్వేల్ బరిలో ఉండాలా? లేదా? అన్నది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితంతో బద్వేలు ఎన్నికకు దూరంగా ఉండాలని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.బద్వేలు కడప జిల్లాలోనిది. వైఎస్ జగన్ కుటుంబానికి పట్టున్న ప్రాంతమది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లోనూ వైసీపీకి బద్వేలు లో ముప్ఫయి వేల మెజారిటీకి పైగానే వచ్చింది. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమే. ఇది కూడా రిజర్వ్ నియోజకవర్గం కావడంతో వైసీపీికి ఈ ఎన్నిక కూడా అడ్వాంటేజీగా ఉంటుంది. వరస ఓటముతో డీలా పడిఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎన్నికకు సిద్ధమవ్వాలా? లేదా? అన్న సందిగ్దంలో పడిపోయారు.తిరుపతి ఉప ఎన్నిక వస్తుందని తెలిసే నాటికి ఏపీలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగకపోవడంతో చంద్రబాబు వెంటనే తిరుపతిలో పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కానీ ఇప్పుడు చూస్తే టీడీపీ అన్ని ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయింది. ఈ పరిస్థితుల్లో బద్వేలులో పోటీకి దూరంగా ఉండటమే మేలన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించారు కాబట్టి పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.ఇటీవల చంద్రబాబు కడప జిల్లా నేతలతో ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. వారు కూడా పోటీకి దూరంగా ఉండటమే బెటరని సూచించినట్లు చెబుతున్నారు. అయితే టీడీపీ పలుసార్లు బద్వేలు నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. 1983, 1985, 1994, 1999 లలో నాలుగు సార్లు టీడీపీ గెలిచింది. దీంతో పోటీకి దిగి తమ ఓటు బ్యాంకు చెక్ చేసుకోవడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నికపై చంద్రబాబు డైలమాలో ఉన్నారని చెబుతున్నారు.

Related Posts