ఏలూరు, మే 20,
లాక్‌డౌన్ ప్రభావం వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, ఆక్వా, పౌల్ట్రీలపై తీవ్రంగా పడింది. పాడి రైతులను ప్రభుత్వం మొత్తానికే విస్మరించగా, ఆక్వా, పౌల్ట్రీలపై హడావిడి తప్ప తక్షణ నిర్దిష్ట ఉపశమన చర్యలు నామమాత్రం. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి పాలు, పౌల్ట్రి, ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు లేకున్నా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో పోలీస్ శాఖ ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసింది. అనుమతులు, తనిఖీలంటూ దిగ్బంధించింది. చాలా రోజుల తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనుబంధ రంగాల్లో అత్యంత ప్రధానమైనది, కోట్ల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నది పాడి రంగం. దాదాపు 40 లక్షల మంది పాడి రైతులు రాష్ట్రంలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. కరువు కాటకాలచ్చి వ్యవసాయం స్తంభించినా, కూలీలకు పనులు లేకపోయినా అన్ని కాలాల్లో పాడి రంగం కొంత వరకు గ్రామీణ ఉపాధికి గ్యారంటీ ఇస్తోంది. ఎపిలో 47 లక్షల ఆవులు, 64 లక్షల బర్రెలు ఉన్నాయి. సంవత్సరానికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి రోజూ సగటున 1.52 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కోటి లీటర్లను చిన్నా చితకా 57 ప్రైవేటు డెయిరీలు సేకరిస్తుండగా, తతిమ్మా 52 లక్షల లీటర్లను సహకార డెయిరీలు సేకరిస్తున్నాయి. మామూలు రోజుల్లో లీటరు గేదె పాలకు రూ.35-40, ఆవు పాలకు రూ.20-25 వంతున రైతులకు చెల్లిస్తున్నాయి. ప్రాసెస్ చేసిన లీటర్ పాలను వినియోగదారులకు రూ.55కు అమ్ముతున్నాయి. ఇతర పాల ఉత్పత్తులను కూడా కలుపుకుంటే లీటర్‌పై సగటున రూ.20 లాభం పొందుతున్నాయి. దానిలో కనీసం రూ.10 పాడి రైతులకు దక్కేలా చూడాలన్న డిమాండ్ ఉంది. లాక్‌డౌన్‌లో గ్రామాల్లో పాల సేకరణ, రవాణాకు ఇబ్బందులేర్పడ్డాయి. హోటళ్లు, రెస్టారెంట్లు లేకపోవడంతో పాల రైతులు అనివార్యంగా కంపెనీలను ఆశ్రయించాల్సి వచ్చింది. దాంతో ఇంకా ధరలు తగ్గించాయి. అవి మాత్రం లీటర్ పాలను రూ.5 పెంచి రూ.60కి అమ్ముతున్నాయి. లాక్‌డౌన్ వలన పశువుల దాణా అందుబాటులో లేదు. ఉన్నా ధరలు పెరిగాయి. ఒక వైపు ఖర్చులు పెరగ్గా, మరో వైపు సేకరణ ధరలు తగ్గడంతో పాడి రైతులు మరింతగా ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నారుపౌల్ట్రీ రంగంలో సన్న, చిన్నకారు, మధ్యతరగతి పెంపకందార్లే అధికం. ఏడాదిలో రెండు వేల కోట్ల కోడిగుడ్లు, 8 లక్షల టన్నుల చికెన్ ఉత్పత్తి జరుగుతోంది. సాధారణంగా వేసవిలోనే పౌల్ట్రి ఉత్పత్తులకు గిరాకీ ఉంటుంది. అదే సమయంలో లాక్‌డౌన్ రావడంతో అమాంతం పౌల్ట్రి దెబ్బ తింది. రవాణా సదుపాయాల్లేక పోవడం, మార్కెట్లు బంద్ కావడంతో రోజువారీగా ఉత్పత్తి అయిన గుడ్లు వృధా అయ్యాయి. పైపెచ్చు చికెన్, గుడ్లు తింటే కరోనా వ్యాపిస్తుందన్న ప్రచారంతో జనం ఆ వైపు చూడలేదు. చాలా చోట్ల గుడ్లు, చికెన్, కోళ్లను ఉచితంగా పంపిణీ చేసినా తీసుకోలేదు. వదంతులపై ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమైంది. ఇప్పుడిప్పుడే చికెన్, గుడ్లకు డిమాండ్ పెరగ్గా, మధ్య దళారీలు వాటి ధరలను అమాంతం పెంచేశారు.
ఎపిలో ఆక్వా 1.40 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రిజిస్ట్రేషన్లు లేకుండా అనధికారికంగా మరో 40 వేల హెక్టార్లలో సాగవుతున్నట్లు అంచనా. ఏడాదిలో 32 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. దీనిలో అత్యధిక భాగం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆక్వా సాగు జూదంగా మారింది. రొయ్యలకు వైట్‌స్పాట్ వంటి వైరస్‌లచ్చిన సందర్భాల్లో రైతులు నష్టపోతున్నారు. రెండు మూడేళ్లుగా మన రొయ్యలను విదేశాలు తిరస్కరిస్తున్నాయి. కెమికల్స్ అధికంగా వాడుతున్నారని అభ్యంతరపెడుతున్నాయి. ఆ సమస్య ఉండగానే లాక్‌డౌన్ వచ్చింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి. రైతులకు ధరలు దిగజారాయి. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా మద్దతు ధరలు (ఎంఎస్‌పి) ప్రకటించినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ప్రాసెసింగ్ యూనిట్లను తెరిపిస్తామన్నా ఆచరణ సాధ్యం కాలేదు. ఎగుమతులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతున్నా రోజుకు 500 లారీలకు 50 కూడా వెళ్లట్లేదని స్వయాన సంబంధిత మంత్రే పేర్కొన్నారు. సరైన కోల్డ్ స్టోరేజీలు లేక, స్థానిక మార్కెట్‌లో తక్కువకు అమ్మలేక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక పట్టుపురుగుల పరిశ్రమ సైతం దెబ్బతింది. పట్టు పురుగులు బయటికొస్తున్నాయి. రవాణా లేక రైతులు నష్టపోయారు.