YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వన్ మ్యాన్ ఆర్మీలా సోను

వన్ మ్యాన్ ఆర్మీలా సోను

ముంబై, మే 20, 
రీలైఫ్ లో సోనూ సూద్ విలన్ వేషాలే వేశారు. ఆయన అతి భయంకరమైన ప్రతి నాయకుడిగా కనిపించి జనాలను బెంబేలెత్తించారు. కానీ విలన్ గా వేసిన వారు అందరూ రియల్ లైఫ్ లో దుష్టులు కారు అని ఎన్నో సార్లు రుజువు అయింది. ఇక సోనూ సూద్ గత ఏడాది మొదటి దశ కరోనా నుంచి తన హీరోయిజాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఇపుడు రెండవ దశలో కూడా ఆయన నాన్ స్టాప్ గా జనాలకు సేవ చేస్తూ నేనే హీరో అంటున్నాడు. సోనూ సూద్ సేవలను మెచ్చని వారు ఎవరూ లేకపోయినా ఆయన వీర లెవెల్ హీరోయిజం మాత్రం కొందరికి ఇబ్బందికరంగా మారుతోందిట.సోషల్ మీడియాలో తెలుగు జనాలు ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటారు. వీరంతా ఇపుడు సోనూ సూద్ తో మన హీరోలను పోలుస్తున్నారు. ఆయన రియల్ లైఫ్ లో హీరో గా ఉంటున్నారు. కానీ మన వెండి తెర వేలుపులు ఏం చేస్తున్నారు అంటూ ఏకంగా సెటైర్లు వేస్తున్నారు. కరోనా వేళ లాక్ డౌన్ టైమ్ లో తోట పని ఇంటి పని వంట పని చేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు జనాలకు కాస్తా సేవ చేయండి డమ్మీ గాడ్స్ అంటూ కౌంటర్లేస్తున్నారు. దీంతో ఈ పోలికే చాలా మందికి చిక్కులు తెచ్చిపెడుతోందిట.నిజానికి మొదటి దశ కరోనా వేళలో మన హీరోలు కూడా తమకు తోచిన విధంగా సేవ చేశారు. విరాళాలను కలెక్ట్ చేసి సినీ కార్మికుల ఆకలి తీర్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే రెండవ దశలో దేశం మొత్తం ఏలికల నుంచే పెద్దగా స్పందన లేదన్నది ఘాటు విమర్శ. అంతా లైట్ గానే తీసుకున్నారు. దీంతో సినీ వర్గం కూడా కొంత సైలెంట్ అయింది అంటున్నారు. దీనికంటే కూడా మరి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చెబుతారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ టాలీవుడ్ కి అవసరాలు ఉన్నాయి. గతంలో వరదల వేళ కేసీయార్ సర్కార్ కే ఎక్కువ మంది హీరోలు విరాళాలు ఇచ్చారు. దాంతో ఏపీకి సాయమేదీ అన్న ప్రశ్నతో పాటు పెద్ద రచ్చ కూడా అయింది. ఇపుడు కూడా ఇస్తే ఇద్దరికీ ఇవ్వాలి, అందుకే గమ్మున ఉంటే పోలా అనే ఇలా చేస్తున్నారు అన్న ప్రచారమూ ఉంది.సాయం అనగానే కేవలం సినిమా వర్గం మీదనే అందరూ చూస్తారు. ఎందుకంటే వారు వెండి తెర ద్వారా డైరెక్ట్ గా పరిచయం అవుతారు కాబట్టి. కానీ వారిని మించి సంపన్నులు ప్రముఖులు సమాజంలో చాలా మంది ఉన్నారు. అంతా కలసి తలో చేయి వేస్తే ఈ కష్టకాలంలో ప్రభుత్వాలకు కాళ్ళూ చేయీ సాగదీసుకునే వీలు ఉంటుంది అంటున్నారు. తమిళనాడులో హీరోలంతా క్యూ కట్టి మరీ కొత్త సీఎం స్టాలిన్ కి విరాళాలు ఇస్తున్నారు. అలాగే వివిధ రంగాల నుంచి కూడా సాయం దక్కుతోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలో కూడా స్పందించి ముందుకు రావాలన్న మాట అయితే ఉంది. నిజం నిష్టూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సత్యమైన మాట చెప్పాలంటే వన్ మాన్ ఆర్మీలా సేవ చేస్తున్న‌ సోనూ సూద్ లాంటి వారు మాత్రం దేశంలోనే అరుదు. నెటిజన్లు కూడా అదే మాట అంటున్నారు. దానికి ఎవరూ నొచ్చుకోనక్కరలేదు. ఎవరి మటుకు వారు సాయం చేయడానికి ముందుకు వస్తే అదే పదివేలు

Related Posts