YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

గందరగోళానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు

గందరగోళానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు

ముంబై, మే 20 
ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఒక చికిత్సతో సత్ఫలితాలు వస్తాయని ప్రకటించిన కొన్నిరోజులకే అది పనికిరాదని తేల్చటం, ఫలానా జాగ్రత్తలు మేలని చెప్పిన తర్వాత.. ఆ జాగ్రత్తలతో ఫలితమే లేదని అనటం జరుగుతూ ఉంది. ఇదే ఒరవడిలో.. తాజాగా కరోనా టీకా కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి మరోసారి మారింది. ఈ నేపథ్యంలో కరోనా కల్లోలం ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం, మార్పులు, సవరణలను చూద్దాం.
మాస్క్‌లు
క‌రోనా క‌ట్ట‌డికి వ‌స్త్రంతో త‌యారైన మాస్క్‌లు ధ‌రించాల‌ని తొలుత కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. ఎన్‌-95 మాస్క్‌తో పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని నిపుణులు తెలిపారు. ఇటీవ‌ల రెండు వేర్వేరు ర‌కాల మాస్క్‌ల‌ను ( ఒక‌టి స‌ర్జిక‌ల్‌, మ‌రొక‌టి వ‌స్త్రంతో త‌యారైన ) ధ‌రించ‌డం ఉత్త‌మ‌మ‌ని కేంద్రం తెలిపింది. మ‌రి కొంద‌రు వైద్యులు మూడు మాస్కుల‌ను ధ‌రించ‌డం మంచిద‌ని చెబుతున్నారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌
మలేరియా చికిత్సకు వాడే ఈ ఔషధం కరోనాను ఎదుర్కోవటంలోనూ మెరుగ్గా పనిచేస్తుందని పలు ఔషధ సంస్థలు పేర్కొన్నాయి. కొవిడ్‌-19 రోగుల చికిత్సకు దీన్ని వాడొచ్చని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ గతేడాది అనుమతులను కూడా ఇచ్చింది. అమెరికాకు పెద్దఎత్తున ఈ ఔషధాన్ని భారత్‌ ఎగుమతి చేసింది. అయితే, కరోనా తీవ్రతను తగ్గించడంలో ఈ ఔషధం అంతగా పనిచేయట్లేదని తర్వాత పరిశోధనల్లో వెల్లడైంది
వైరస్‌ వ్యాప్తి
తుమ్మ డం, దగ్గడం వల్ల 6 అడుగుల దూరం వరకు కరోనా ప్రయాణించగలదని, గాలి ద్వారా వైరస్‌ ప్రయాణిస్తుందనడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గతంలో ప్రకటించింది. అయితే అమెరికా, బ్రిటన్‌, కెనడా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో గాలి ద్వారా కూడా కరోనా ప్రయాణిస్తుందని, తలుపులు, కిటికీలు మూసి ఉంచిన గదిలో 12 అడుగుల దూరం వరకు వైరస్‌ ప్రయాణించగలదని తేలింది.
ప్లాస్మా చికిత్స
కరోనా రోగుల చికిత్సకు కాన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ సాయపడుతుందని తొలుత కేంద్రం ప్రకటించింది. దీంతో ప్లాస్మా దాతల కోసం రోగుల కుటుంబసభ్యులు అప్పట్లో జల్లెడ పట్టి వెదికేవారు. అనంతరం వ్యాధి లక్షణాలు ఒక మోస్తరుగా ఉన్నప్పుడు, వైరస్‌ సోకిన ఏడు రోజులలోపే రోగులకు ప్లాస్మాను ఇవ్వాలని కేంద్రం సవరణలు చేసింది. అయితే, ప్లాస్మా థెరపీతో ఉపయోగం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఐవర్‌మెక్టిన్‌
యాంటీ పారసైటిక్‌ ఔషధం ‘ఐవర్‌మెక్టిన్‌’ను క్రమం తప్పకుండా వాడటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని అమెరికాకు చెందిన ఫ్రంట్‌లైన్‌ కొవిడ్‌-19 క్రిటికల్‌ కేర్‌ అలయన్స్‌ పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ వాదనను డబ్ల్యూహెచ్‌వో తోసిపుచ్చింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం మినహా ఈ ఔషధాన్ని వాడొద్దని సూచించింది. కొవిడ్‌-19 చికిత్సకు ఐవర్‌మెక్టిన్‌ సమర్థమంతంగా పనిచేస్తున్నట్టు శాస్త్రీయ ఆధారం లభించలేదన్నది.
ఆవిరి పట్టడం
కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో.. ఆవిరి పట్టడం (స్టీమ్‌ ఇన్‌హలేషన్‌) వల్ల శరీరంలో ఉన్న వైరస్‌ నశిస్తుందని ప్రచారం జరిగింది. కొంతమంది వైద్యులు కూడా దీన్ని సమర్థించారు. అనంతరం ఇది అవాస్తవమని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే ‘ఆవిరి పట్టడం’ మేలు చేస్తుందని, అయితే ఇది చికిత్సకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం మాత్రం కాదని ప్రభుత్వం తెలిపింది.

Related Posts