YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మార్కెట్ ను ముంచెత్తుతున్న నకిలీలలు

మార్కెట్ ను ముంచెత్తుతున్న నకిలీలలు

ఖమ్మం, మే 20, 
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెమ్‌డెసివిర్ల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ నియమించినప్పటికీ కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం అక్రమ సంపాదన వదలడం లేదు. ఓ పక్క ఇంజక్షన్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటూనే, మరో పక్క ప్రాణాపాయంలో ఉన్న కరోనా పేషెంట్లకు నకిలీ ఇంజక్షన్లు వేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఖమ్మంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కరోనా పేషెంట్‌ను కుటుంబసభ్యులు చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా నకిలి రెమిడెసివిర్ ఇంజక్షన్ చేయడం వల్ల చనిపోయాడంటూ మృతుని కుటుంబ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీవని తేల్చేందుకు ఆధారాలు కూడా సమర్పించారు. దీంతో ఆస్పత్రిలో తనిఖీలు చేయాల్సిందిగా కలెక్టర్ డ్రగ్ ఇన్ స్పెక్టర్‌ను ఆదేశించగా మంగళవారం ఆస్పత్రిపై దాడులు చేసి నకలీ రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు తేల్చారు. కల్తీ ఇంజక్షన్ చేయడం వల్లే ఆ పేషెంట్ చనిపోయాడంటూ నివేదిక సమర్పించడంతో ఆ డాక్టర్‌పై కేసు నమోదైంది. అంతేకాదు ఆస్పత్రిని సీజ్ చేసేందుకు కూడా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డాక్టర్‌ను రక్షించేందుకు మెడికల్ అసోసియేషన్ బాధ్యులతో పాటు కొంతమంది పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడానికి చెందిన మొదుగల్ల భద్రయ్యకు కరోనా లక్షణాలు కన్పిచండంతో గత నెల 20వ తేదీన కుటుంబసభ్యులు ఖమ్మం నగరంలోని బాలాజీ చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. అయితే ఈ నెల 4వ తేదీ వరకు తతంగం అంతా నడిపించి 5వ తేదీ పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ వేరే ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో రూ. 64 వేలు చార్జ్ చేసి భద్రయ్యకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లంటూ పౌడర్‌ను లిక్విడ్‌తో (గ్లూకోజ్ బేస్డ్) కలపి ఇంజెక్ట్ చేశారు. ఆస్పత్రి వర్గాలపై ముందునుంచీ అనుమానం ఉన్న భద్రయ్య కొడుకు సందీప్.. ఇంజక్షన్ ఇస్తున్న క్రమంలో వీడియో సైతం తీశాడు. అది నకిలీదని నిర్ధారించుకునే లోపే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందంటూ ఖమ్మంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లగానే భద్రయ్య మృతిచెందాడు. అయితే కరోనా పేషెంట్ మృతిచెందడంతో 14రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్న మృతుని కొడుకు సందీప్ మంగళవారం కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసి తన దగ్గర ఉన్న వీడియోను సమర్పించాడు. కరోనా ట్రీట్మెంట్ పేరుతో రూ.లక్షల్లో బిల్లు కట్టించుకున్నారని చెప్పాడు. దీంతో వైద్యాధికారులు బాలాజీ ఆస్పత్రిపై తనిఖీలు చేసి నకిలీ రెమ్‌డెసివిర్‌ల దందా జరుగుతోందని స్పష్టం చేయడంతో డాక్టర్ శ్యాం కుమార్ పై కేసు నమోదైంది.డబ్బులకు కక్కుర్తి పడి నకలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన డాక్టర్‌పై, ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయవాద వృత్తిని చేపట్టిన ఓ డాక్టర్ సతీమణి, మెడికల్ అసోసియేషన్ బాధ్యులు, కొందరు డాక్టర్లు కలిసి పెద్దల సహకారంతో కేసు నుంచి ఆస్పత్రిని, డాక్టర్‌ను తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే కాసుల వేటలోపడి ఆపత్కాలంలో మానవత్వాన్ని మరిచి మనిషి ప్రాణం తీసిన వారిని శిక్షించి, ఆస్పత్రిని సీజ్ చేయాలని మృతుని కుటుంబసభ్యులతో పాటు పలువురు కోరుతున్నారు.

Related Posts