YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

నిర్మల్ జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తుడు. రోజు రోజుకు ఎండ పెరిగిపోవడం ఉష్ణోగ్రతలు తీవ్రమవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే వాతావరణంలో ఉష్ణోగ్రత అలముకుంటోంది. ఇక 9 గంటలైతే ఎండు చుర్రుమంటోంది. దీంతో బయటకు రావాలంటే అంతా హడలిపోతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పులు సైతం పెరుగుతుండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు కాలు బయటపెట్టడంలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిర్మల్ లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. మే నెలలో ఈ ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులే అంటున్నారు. ఫలితంగా ఈ ఏడాదిలోనూ భీకర ఉష్ణోగ్రతలు అనుభవించాల్సి ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. ఇదిలాఉంటే ఉదయం ఏడు గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఎనిమిది అయినా తగ్గడం లేదు. ఫలితంగా ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాల్లో ఆదిలాబాద్‌ కూడా ఉంటోంది. గతంలో కంటే ఈ దఫా వేడిమి ఎక్కువగా ఉండటం ప్రజలను కలవరపరుస్తోంది. అత్యవసరమైతే తప్ప ఎండలో వెళ్లకూడదని, వేడి తీవ్రత తగ్గిన తరువాత వెళితే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఏటా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే అత్యధికఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఇక మే నెలలో అయితే టెంపరేచర్ 46-48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నైరుతి, పశ్చిమ దిశగా వీస్తున్న వేడిగాలుల ఫలితంగా ఉష్ణోగ్రత పెరిగిందని చెప్తున్నారు. గాలిలో తేమ 24-28 శాతానికి పడిపోయిందని, అందుకే ఎండ తీవ్రత ఎక్కువైందని వివరిస్తున్నారు. వాతావరణంలో అనూహ్యంగా పెరుగుతున్న వేడిమి.. ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఉష్ణతాపాన్ని జయించేందుకు మంచినీళ్లు, పండ్లరసాలు, ఓఆర్ఎస్ ద్రావణం అధికంగా సేవించాలని సూచిస్తున్నారు.

Related Posts