ఆరోగ్యవంతమైన సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సర్కారీ దవాఖానాలను పటిష్టం చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్ధవంతమైన సేవలు అందించేలా విధానాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లాపైనా దృష్టి సారించింది. ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా హాస్పిటల్ గా రూపుదిద్దేందుకు చర్యలు తీసుకుంది. నాగర్ కర్నూల్ లోనే కాక ఉమ్మడి పాలమూరులోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు మహబూబ్‌నగర్ పెద్దాస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా పరిగణించేవారు. నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు దవాఖానాలు ప్రాంతీయ ఆస్పత్రులుగా కొనసాగేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రాంతీయ హాస్పిటల్స్ జిల్లా ఆసుపత్రులుగా మారనున్నాయి. దీంతో ప్రజలకు తమ ప్రాంతాల పరిధిలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది. వారు మహబూబ్ నగర్ లోని పెద్దాసుపత్రికి రావాల్సిన అవసరం అంతగా ఉండదని అంతా అంటున్నారు.
నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు ప్రాంతీయ ఆస్పత్రులు ప్రస్తుతం అరకొర వసతులతో నడుస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు అభివృద్ధి కాలేదు. నాగర్‌కర్నూలు ఆస్పత్రి 100 పడకలతో కొనసాగుతోంది. 18 మంది వైద్యులకు 9 మంది మాత్రమే ఉన్నారు. 26 మంది స్టాఫ్‌నర్సులు ఉండాల్సి ఉండగా.. 20 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుకు ఆస్పత్రులను 250 పడకలతో జిల్లా ఆస్పత్రులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో ముందడుగు అన్నట్లు ఇటీవలే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,400 పోస్టులను మంజూరు చేసింది. ఈ కోటాలో జిల్లా ఆస్పత్రుల్లో అవసరం మేరకు నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ప్రాంతీయ ఆస్పత్రులు జిల్లాస్థాయి దవాఖానాలుగా రూపొందితే మౌలిక వసతులు మెరుగుపడటంతోపాటు వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ప్రజలకు విస్తృత స్థాయిలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది.