YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆకలి కేకలు

ఆకలి కేకలు

 బాసర ఆర్జీయూకేటీలో భోజనశాలల పరిస్థితి మారటం లేదు. విద్యార్థుల భోజన ఖర్చులకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా విద్యార్థుల ఆకలి మాత్రం తీరటం లేదు. నాణ్యమైన ఆహారం కోసం విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా, జిల్లా యంత్రాంగం సూచించినా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించటం లేదు. భోజనశాలల క్యాటరింగ్‌ సంస్థల కక్కుర్తి, అధికారుల నిర్లిప్తత విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది.

విద్యాసంస్థ ఆరంభం నుంచి విద్యార్థులు తిండికోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడుస్తున్నా, అధికారులు మారతున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించటం లేదు. భోజనశాలలు దక్కించుకునేందుకు పోటీపడుతున్న క్యాటరింగ్‌ సంస్థలు విద్యార్థుల ఆహారంపై మాత్రం శ్రదÄ్దచూపటం లేదు. పోటీపడి మరీ తక్కువ ధరకు టెండర్‌ను దక్కించుకుంటున్న సంస్థలు నాణ్యతను పాటించటంలేదు. విద్యాలయంలో రెండు భోజనశాలలు ఆరు వేల మంది విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో విద్యార్ధికి ప్రభుత్వం రోజుకు రూ.60 వరకు చెల్లిస్తుంది. అయితే లక్షలాది రూపాయలు పొందుతున్న సంస్థలు కనీస ప్రమాణాలు పాటించటం లేదు. విద్యాలయంలో ఆహార పట్టిక అసలు అమలేకాదు. భోజనాల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు మెస్‌కమిటీలున్నా స్పందన శూన్యం. వారు చేసే సిఫారసులను పట్టించుకునే వారే లేరు. పైగా క్రియాశీలకంగా పనిచేసి, తరచూ మెస్‌ యజామాన్యాలపై ఫిర్యాదుచేస్తే విద్యార్థులకు మెస్‌ యాజమాన్యాల, అధికారుల వేధింపులు తప్పవు.

ఆన్‌లైన్‌లో రేటింగ్‌ ఓ కనికట్టుగా మారింది. ఇక చేసేదేమిలేక విద్యార్థులు మెస్‌ యజామాన్యాలు పెట్టింది తిని కాలం వెళ్లదీస్తున్నారు. మెస్‌ యాజమాన్యాలు కుళ్లిపోయిన, వాడిపోయిన కూరగాయలను మార్కెట్‌లో తక్కువ రేటుకు కొనుగోలు చేసి విద్యార్థుల భోజనానికి వినియోగిస్తారు. పప్పుదినుసులు, బియ్యం నాణ్యత సైతం రేండోగ్రేడ్‌ నాణ్యత కలిగి ఉంటుంది. గతంలో నిర్మల్‌ ఆర్డీవోగా ఉన్న అరుణశ్రీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించినప్పుడు మెస్‌ల అక్రమాలు కళ్లకు కట్టాయి. భోజనశాలల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. 2000మంది విద్యార్థుల చొప్పున మూడు మెస్‌లకు విద్యాలయం టెండరు నిర్వహించగా ప్రస్తుతం రెండు మెస్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణ పొందిన హాకా సంస్థ విడివిడిగా రెండు మెస్‌లను నిర్వహించాల్సి ఉండగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు 4000 మందికి ఒకే మెస్‌ను నిర్వహిస్తున్నారు. టెండరు హక్కులు పొందిన హాకా సంస్థ మెస్‌లను నిర్వహించకుండా అనుభవంలేని కొంతమందికి నాలుగువేల మంది భోజన బాధ్యతలు అప్పగించటంతో పరిస్థితి దారుణంగా మారింది. మెస్‌ నిర్వహణను దక్కించుకున్న వారు కుళ్లిన కోడిగుడ్లను, వాడిన కూరగాయలను విద్యార్థులకు ఆహారంగా వండి పెడుతున్నారు. నాణ్యమైన కూరగాయలు భోజనశాలల్లో కనిపించవు. సీజన్‌వారీగా, స్థానికంగా దొరికే తక్కువ ధర ఉన్న కూరగాయలను మాత్రమే విద్యార్థులకు ఆహారంగా అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వరుసగా రెండు, మూడు రోజుల పాటు ఒకే కూరను వడ్డించిన సందర్భాలు కోకొల్లలు. మరో మెస్‌ థాకర్స్‌ సైతం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించటంలో విఫలమవుతోంది. తరచూ విద్యార్థుల ఆందోళనలు షరామామూలుగా మారాయి.

విద్యార్థుల శారీరక ప్రగతికి సంపూర్ణ పోషకాలు అందించాలని భావించి విద్యాలయం వారం రోజుల్లో ప్రతి రోజూ విద్యార్థులకు అందించాల్సిన ఆహారానికి సంబంధించి పట్టిక రూపొందించింది. అయితే దీన్ని అమలు చేయటంలో భోజనశాలలు విఫలమవుతున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజూ అరటిపండు, గుడ్డు అందించాల్సిఉండగా కేవలం మూడు రోజులకే పరిమితమవుతున్నారు. విద్యార్థికి ఆహారంలో ఒక్కరోజు గుడ్డు అందించకుంటే రూ.30 వేల వరకు మిగిలే అవకాశం ఉండటంతో వారంలో మూడు రోజులు ఆహారంలో గుడ్డు కనిపించటంలేదు. ఆదివారం ఒక్కో విద్యార్థికి 175 గ్రాముల కోడి మాంసాన్ని వడ్డించాలి. విద్యార్థికి మాత్రం 50 గ్రాములకు మించి లభించదు. శాఖాహారులకు పన్నీరు వడ్డించాల్సిఉండగా ఇప్పటి వరకు ఒక్కసారైనా పన్నీరు పెట్టలేదంటే భోజనశాలలు వ్యవహరిస్తున్న తీరు అర్థమవుతుంది.

Related Posts