YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మిగిలినవాటి సంగతేంటి..?

మిగిలినవాటి సంగతేంటి..?

 చంద్రన్న కానుకల పంపిణీ జరిగి అయిదు నెలలు కావస్తోంది... పంపిణీ సమయంలో జిల్లాకు కేటాయించిన కానుకలు... ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న లెక్కలకు తేడా కనిపిస్తోంది... తేడా ఉన్న కానుకలు డీలర్ల నుంచి ఎంఎల్‌ఎస్‌పాయింట్లకు చేరాయా?.. అసలు    డీలర్ల నుంచే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరలేదా?... ఒకవేళ డీలర్ల నుంచే ఇవీ రాకపోతే వాటికి సంబంధించిన విలువను వారి నుంచి వసూలు చేయాలనే ఉత్తర్వులు వెలువడ్డాయి... అయినా అధికారులు స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో పేదలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో చౌకదుకాణాల నుంచి కార్డుదారులకు ఈ కిట్లు అందజేసింది. వీటిల్లో పామాయిల్‌, శనగపప్పు, పంచదార, బెల్లం, నెయ్యి, గోధుమపిండి లాంటి ఆరు రకాల వస్తువులు సంచిలో పెట్టి మరీ పంపిణీ చేశారు. ఒక్కొక్క దాని విలువ సుమారు రూ.250. ఆ రోజున జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా డీలర్లకు చేరిన కానుకల సంఖ్యకు ప్రస్తుతం కార్డుదారులకు చేరిన వాటికి తేడా ఉండటం గమనార్హం. దీంతో ఈ కానుకలు ఉన్న కిట్‌లు ఎక్కడున్నాయనే దానిపై జిల్లా అధికారులు నేటికీ దృష్టి సారించకపోవటం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఒకవేళ డీలర్లు దగ్గర ఇవీ మిగిలి ఉంటే వాటికి సంబంధించి విలువను వారి నుంచి వసూలు చేయాలనే పౌరసరఫరాలశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు విడుదలైనా ఆదిశగా అధికారులు మిన్నకుండడం విడ్డూరంగా ఉంది.

జిల్లాలోని 2119 రేషన్‌ దుకాణాలున్నాయి. వీటిల్లో 9,36,094 తెల్లకార్డుదారులున్నారు. అదే సంఖ్యలో కానుకలను పంపిణీ చేసేందుకు కేటాయించారు. వాటిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా డీలర్లకు చేర్చారు. అయితే ఇప్పటి వరకు పౌరసరఫరాలశాఖాధికారుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం 8,42,010, యర్రగొండపాలెం ప్రాంతంలో సర్వర్‌లో లోపాలు ఉండటంతో అక్కడ ఉన్న 13 దుకాణాల ద్వారా మరో 10 వేల మందికి వీటిని అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు 852,010 కానుకలు పంపిణీ జరిగినట్లు ఉంది. అంటే వచ్చిన కానుకలకు, పంపిణీ చేసిన వాటికి మధ్య తేడా 84,084 ఉంది.

జిల్లావ్యాప్తంగా ఉన్న పౌరసరఫరా గోదాముల ద్వారా డీలర్లకు చంద్రన్న కానుకలు చేర్చిన అధికారులు ఆ తరువాత వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. డీలర్ల వద్ద మిగిలిన కిట్‌లు వెంటనే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేర్చాలని, అలా చేర్చని డీలర్ల నుంచి వాటి విలువ(కందిపప్పు అరకిలో రూ.36.75, పామోలిన్‌ ఆయిల్‌ రూ.40.26, శనగపప్పు రూ.40.50, గోధుమపిండి రూ.41.84, నెయ్యి రూ.42.98, సంచి రూ.13.50, పంచదార రూ.25.98) వసూలు చేయాలి జనవరి 23వ తేదీ పౌరసరఫరాల ఎండీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. అయినా అధికారులు స్పందించలేదు. అయితే డీలర్లకు మాత్రం ఒక్కొక్క కానుక కార్డుదారులకు అందజేసినందుకు రూ.10 వంతున కమీషను మొత్తాన్ని ఫిబ్రవరి నెలలో తీసే డీడీ నుంచి అధికారులు మినహాయించారు. మిగిలిన కానుకల సంగతేంటని ఆరా తీయడంలేదు.

చీరాల పౌరసరఫరాల గోదాము నుంచి చినగంజాం, వేటపాలెం, చీరాల మండలాల్లో 70,847 రేషన్‌కార్డులున్నాయి. ఈ మేరకు జనవరిలో వచ్చిన సంక్రాంతి కానుకలను ఆయా రేషన్‌ దుకాణాలకు చేర్చారు. అయితే వీటిల్లో 65,033 కానుకలు పంపిణీ జరిగాయి. 2,971 కానుకలు తిరిగి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కి చేరాయి. నేటికీ డీలర్ల నుంచి రాని కిట్‌లు దాదాపు రెండువేలకు పైనే ఉన్నాయి.  అద్దంకి పరిధిలో అద్దంకి, కొరిశపాడు, పంగులూరు, సంతమాగులూరు మండలాల్లో సుమారు 71,566 రేషన్‌కార్డులు ఉండటంతో అంతే మొత్తంలో చంద్రన్న కానుకలకు సంబంధించిన కిట్‌లు పంపారు. అయితే జనవరి చివరి నాటికి మాత్రం 151 తిరిగి గోదాములకు చేరాయి. ఆ తరువాత ఒంగోలు తీసుకెళ్లాలని డీలర్లకు సూచించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం కారణంగానే నేటికీ ఈ కిట్‌ల లెక్కలు తేలని పరిస్థితి నెలకొంది.

Related Posts