YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీటి సమస్య పట్టదా...?

 నీటి సమస్య పట్టదా...?

 ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చేపట్టిన కీలక పథకాలు ఏళ్లు గడుస్తున్నా  అక్కరకు రావడం లేదు. అసంపూర్తి పనులు, నాసిరకం నిర్మాణాలు కళ్లకు కడుతున్నాయి. రూ.100 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఈ పురపాలిక ఉంది. మొత్తం 40 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.17 లక్షల ప్రజలు నివసిస్తున్నారు.  ఇక్కడ దశాబ్దాలుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఏటా వేసవి వచ్చిందంటే  నీటికష్టాలు రెట్టింపు అవుతాయి.

ప్రొద్దుటూరు పురపాలికకు రోజుకు 20ఎంఎల్‌డీ నీరు అవసరం. ప్రస్తుతం రామేశ్వరం వాటర్‌వర్క్స్‌ ద్వారా నీటిసరఫరా జరుగుతోంది. నంగనూరిపల్లి వద్ద నుంచి బోర్ల ద్వారా సరఫరా చేసి అందిస్తున్నారు. పెన్నా-1 వాటర్‌వర్క్స్‌ ద్వారా భూగర్భజలాన్ని తోడి అందిస్తున్నారు. వేసవిలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోతోంది. బోర్లు ఒట్టిపోవడం పరిపాటైంది. ఏళ్లుగా ఇదే సమస్య ఉండటంతో పైపులైన్ల ద్వారా నీటిని తెచ్చే ప్రయత్నం చేశారు. అదీ మూలకు చేరింది. అనంతరం పెన్నా-కుందూ వరదకాలువ తవ్వేందుకు సంకల్పించారు. ఇదీ ప్రణాళికా లోపంతో అసంపూర్తిగా మారింది. భూసేకరణకు పలుచోట్ల రైతులు అభ్యంతరం చెబుతుండటంతో ఎటూతేలకుండా ఉంది. ఈ రెండు పథకాలు ప్రస్తుతం ఉండీలేనట్లుగా మారాయి. ప్రజాధనం మాత్రం దుర్వినియోగమైంది.

ప్రొద్దుటూరులో ఐదేళ్ల కిందట నెలరోజుల పాటు నీళ్లు రాని సందర్భాలు ఉన్నాయి. గతేడాది కూడా పక్షం రోజులకు ఓ సారి నీళ్లిచ్చి అధికారులు ‘పెద్దమనసు’ చూపారు. ట్యాంకర్లపై ఆధారపడి జనం అష్టకష్టాలు పడ్డారు.   వేసవిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో కొన్నేళ్లుగా పాలికవర్గాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వేసవి సమస్య దృష్టిలో ఉంచుకుని మైలవరం జలాశయం నుంచి 50 క్యూసెక్కుల నీటిని రామేశ్వరం వాటర్‌వర్క్స్‌ వద్ద బోరుబావుల్లో ఇంకేలా ఏర్పాటు చేశారు. అదీ గండికోటకు నీరు రావడంతో సాధ్యమైంది. లేనిపక్షంలో ఈసారీ నీటికష్టాలు తప్పేవికావు. ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. పథకాల్లో అవినీతిని వెలికి తీయాల్సి ఉంది.

Related Posts