న్యూఢిల్లీ, మే 21,
కాంగ్రెస్ పార్టీ అసలే కష్టాల్లో ఉంది. దీనికితోడు సీనియర్ల ఒత్తిడి మరింత ఎక్కువవుతోంది. సీనియర్ నేతలు గత కొంతకాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలని 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అధ్యక్షుడయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్న సీనియర్లు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి యూపీఏ ఛైర్మన్ పదవిలో మాత్రం కొత్త నేతను నియమించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టాలన్నా, వారి మద్దతును సంపాదించాలన్నా ఇతర పార్టీ నేతలే యూపీఏ ఛైర్మన్ గా ఉండటమే మంచిదన్న అభిప్రాయం సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లగలిగే ఏ నేతనైనా నియమించవచ్చని వారు సూచిస్తున్నారు.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూసింది. అసోం, కేరళలో అధికారంలోకి రాలేకపోయింది. పుదుచ్చేరిని కాపాడుకోలేకపోయింది. పశ్చిమ బెంగాల్ లో కనీస పెర్మఫార్మెన్స్ చూపలేకపోయింది. తమిళనాడులో డీఎంకే అండతో కొన్ని సీట్లను సాధించగలిగింది. దీంతో యూపీఏ ఛైర్మన్ పదవిని ఇతరులకు అప్పగించడమే బెటరన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.పశ్చిమబెంగాల్ ముఖ్మమంత్రి మమత బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్లను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీఏ ఛైర్మన్ గా ఇతరులకు అప్పగిస్తేనే రానున్న ఎన్నికల్లో మోదీని ఢీకొట్టగలమన్న భావనను కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా యూపీఏ ఛైర్ పర్సన్ గా సోనియా గాంధీ వ్యవహరించారు. ఆమె అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీకి దేశంలోని ప్రాంతీయ పార్టీలను సమన్వయ పర్చే శక్తిలేదని భావించిన సీనియర్లు ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ ఇది ఎంతవరకూ సాధ్యమనేది చూడాల్సి ఉంది.