YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ బిడ్డ

కరీంనగర్ బిడ్డ

తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రత్యేక సాధన కోసం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ.. ఉద్యమంతో మొదలై రాజకీయ పార్టీగా అవతరించింది. పుష్కరకాలంగా చేసిన పోరాటాలతో ఏకకాలంలో అటు ప్రత్యేక రాష్ర్టాన్ని, ఇటు అధికారాన్ని సాధించింది. అధికారంలోకి రాకముందు అలుపెరుగని పోరాటం చేసిన గులాబీ దళం అనేక ఆటుపోట్లను చవిచూసి, మరెన్నో అవమానాలను దిగమింగుకొని ముందుకు సాగింది. టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, కేసీఆర్‌ మనస్సులో కరీంనగర్‌ జిల్లాది మొదటి నుంచి ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ మొదలుకొని 2014 సార్వత్రిక ఎన్నికల తొలి బహిరంగ సభ వరకు, అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో తన తొలి పర్యటనను కేసీఆర్‌ కరీంనగర్‌ నుంచే ప్రారంభించడం ఈ జిల్లాకు టీఆర్‌ఎస్‌ పార్టీలో, కేసీఆర్‌ మనస్సులో ఉన్న ప్రత్యేకతకు నిదర్శనం.

తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్‌ పదవిలో కొనసాగుతున్న కె చంద్రశేఖర్‌రావు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నడుంబిగించారు. వేలాది మందితో, వివిధ వర్గాలవారితో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2001 ఏప్రిల్‌ 27న కరీంనగర్‌ ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల మైదానంలో సింహగర్జన పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ రాష్ట్ర, దేశ రాజకీయవర్గాల్లో ఒక్కసారి గా కలకలం రేపింది. అన్నివర్గాల దృష్టి టీఆర్‌ఎస్‌వైపు మళ్లింది. తెలంగాణ ఉద్య మం విజయం సాధించే అవకాశం లేకపోలేదనే ఆశలు రేకెత్తించింది. క్రమంగా కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐ నేతలు టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపడం మొదలు పెట్టారు. ఆయా పార్టీల నుంచి నేతల వలస కరీంనగర్‌లోనే ప్రారంభమయింది.

పార్టీ ఆవిర్భవించి రెండేళ్లు గడవక ముందే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ పోటీకి నిలిచింది. కాంగ్రెస్‌, టీడీపీలను ఢీకొని స్థానిక సంస్థల్లో విజయం సాధించింది. ఉద్యమానికి కీలకమైన కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని, పలు మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను కైవసం చేసుకొని జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీకి ధీటుగా ప్రధాన రాజకీయపక్షంగా నిలిచింది. తొలుత ఆషామాషీగా భావించిన పార్టీ కాస్త తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలంగా వేళ్లూనుకుంటుండడంతో అప్పటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌కు పొత్తు కుదుర్చడంలో కీలకపాత్ర వహించారు. ఫలితంగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కూటమి ఏర్పాటులో కరీంనగరే కీలకపాత్ర వహించి రాజకీయాలను మలుపుతిప్పింది.

కాంగ్రెస్‌ భాగస్వామిగా ఐదుగురు శాసనసభ్యులు ఈ జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టగా ఇక్కడి నుంచే లోక్‌సభ సభ స్థానానికి పోటీ చేసిన కేసీఆర్‌ రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేత ఎం సత్యనారాయణరావు విసిరిన సవాల్‌కు స్పం దించిన కేసీఆర్‌ తన ఎంపీ పదవికి రాజీ నామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు.. ఈ ఎన్ని కల్లో ఘన విజయం సాధించి తన గెలుపు గాలివాటం కాదని నిరూపించారు.. అనంత రం రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి పదవులతోపాటు శాసన సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి జిల్లాలో పోటీ చేసిన అన్ని స్థానాలను సాధించుకున్నారు. ఇతర జిల్లాల్లో కొందరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పరాజయం పాలుకావడం ఆ పార్టీని కొంత కుదుపు కుదిపినా కరీంనగర్‌ ప్రజలు మాత్రం అక్కున చేర్చుకున్నారు.

2004లో కాంగ్రెస్‌తో జత కట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో టీడీపీ, సీపీఐలతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పలుచోట్ల ఓటమి పాలైనా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి పోటీ చేసి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఈ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి హఠాన్మరణంతో తెలంగాణ ఉద్య మం కొత్త పుంతలు తొక్కింది. వైఎస్సార్‌ స్థా నంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యాలు, మరోవైపు టీఆర్‌ఎస్‌, జేఏసీ ఉద్యమాలు, సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, వంటావార్పు, మొదలగు పలు రూపాల్లో ఉధృతంగా సాగాయి. గ్రామాలు కూడా ఉద్య మ కేంద్రాలుగామారి ప్రజలందరు ఉద్యమంలో భాగస్వామ్యం వహించారు.

ఈ దశలో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉత్తర తెలంగాణ భవన్‌గా పిలుచుకునే కరీంనగర్‌ కేసీఆర్‌ నివాసం నుంచి ఆయన దీక్ష చేపట్టనికి 2009 నవంబర్‌ 29న సిద్ధిపేటకు బయల్దేరగా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ వద్ద అరెస్టు చేసి ఖమ్మం, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించడంతో ఉద్యమం రాష్ట్ర నలుమూలలా పాకి పరిస్థితులు అదుపు తప్పడంతో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 10న తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటన చేసింది. ఆంధ్రాప్రాంతంలో ఇందుకు నిరసనలు వ్యక్తం కాగా యూటర్న్‌ తీసుకోవడంతో మళ్లీ ఉద్యమాన్ని ఊరూరికి తీసుకవెళ్లారు. దీంతో 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా బిల్లు ఆమోదం పొందింది.

2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌ 2014లో మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమయింది. ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి ఇతర పార్టీలకన్నా ఒకింత ముందుగా తెలంగాణవాదాన్ని ప్రచారాస్త్రంగా సంధించిన టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానం మినహా అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నది. రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2014 జూన్‌ 2న రాష్ట్ర అవతరణ జరగడంతో అదే రోజు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జిల్లా నుంచి ఈటల రాజేందర్‌, కేటీఆర్‌కు కీలక శాఖలు దక్కగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ పదవి వరించింది. ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కరీంనగర్‌కు కేసీఆర్‌ పెద్దపీట వేసి కీలక శాఖలకు అప్పగించడంతోపాటు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి పర్యటనను ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి కరీంనగర్‌పై తనకున్న ప్రాధాన్యాన్ని చాటుకున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కరీంనగర్‌కు వచ్చి ఉత్తర తెలంగాణ భవన్‌లో సమాలోచనలు చేయడం కేసీఆర్‌ ఆనవాయితీగా మార్చుకున్నారు.

కరీంనగర్‌ ప్రజలు తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తిగతంగా తనపై చూపిన అభిమానానికి కేసీఆర్‌ కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నా రు. నామినేటెడ్‌ పదవుల్లోనూ జిల్లాకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి జి ల్లాకు చెందిన సోమారపు సత్యనారాయణను వరించగా, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పదవి అక్బర్‌ హుస్సేన్‌కు దక్కింది. రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్‌గా రాజేశం గౌడ్‌, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఈద శంకర్‌ రెడ్డి, పోలీస్‌ వెల్పేర్‌ హౌజింగ్‌ సొసైటీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి, టెస్కాబ్‌ చైర్మన్‌గా కె రవీందర్‌రావు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ నియమితులయ్యారు. వీరందరిది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానే. శాసనమండలి చైర్మన్‌గా నియమితులైన స్వామిగౌడ్‌ ఇక్కడి నుంచే ఎమ్మెల్సీగా గెలుపొందారు.

కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా మూల విజయ, ఓరుగంటి ఆనంద్‌, భారతి, శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా జీవి రామకృష్ణారావు పదవులు దక్కించుకున్నారు. 2001లో కరీంనగర్‌ జిల్లాలోకి అడుగిడి తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన కేసీఆర్‌కు 17 సంవత్సరాలుగా జిల్లా ప్రజలు అండగా నిలుస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన జిల్లా పెద్దపీట వేస్తున్నారు. 17వ ప్లీనరీలో కూడా ఈ జిల్లాకు చెందిన నేతలు కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసేందుకు కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో పాలుపంచుకోవాలనే డిమాండ్‌ ఈ జిల్లా నుంచి బలంగా వస్తున్నది. ఈ ప్లీనరీలో ఆ దిశగా నిర్ణయం జరగవచ్చని భావిస్తున్నారు.

Related Posts