YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిషత్ ఎన్నికల రద్దు హైకోర్టు ఆదేశం

పరిషత్ ఎన్నికల రద్దు హైకోర్టు ఆదేశం

విజయవాడ, మే 21,
జగన్ సర్కార్‌కి హైకోర్టులో వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై అప్పటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో గిల్లికజ్జాలపై కోర్టులు మొట్టికాయలు వేసేవరకూ సాగదీసినా చివరికి తలొగ్గక తప్పలేదు. ఆయన పదవీకాలం పూర్తవగానే మాజీ సీఎస్ నీలం సాహ్నీని ఆగమేఘాల మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడం.. ఆమె జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. పోలింగ్ కూడా జరిగిపోయింది.అంతవరకూ బాగానే ఉన్నా ఎన్నికలకు కనీసం నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీం నిబంధనలను పాటించకపోవడంతో వివాదం కోర్టుమెట్లెక్కింది. విపక్షాలు కోర్టులో వేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల విడుదలకు ముందే ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొత్త నోటిఫికేషన్ అనంతరం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అంటూ విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.హైకోర్టు తీర్పుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా స్పందించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. కోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసిందని పవన్ అన్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితులు కారణంగా ఎన్నికలు రద్దు చేశారు. తిరిగి అదే నోటిఫికేషన్‌పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం నిబంధనలు తుంగలో తొక్కడమేనని ఆయన అన్నారు.ఆ ఎన్నికలను జనసేన తీవ్రంగా వ్యతిరేకించిందని.. కొత్త నోటిఫికేషన్ జారీ చేసి పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు తగిన సమయం ఇవ్వాలని జనసేన అప్పుడే డిమాండ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం కావడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ పంతాలకు, పట్టింపులకు పోకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు పవన్ ప్రకటన విడుదల చేశారు.

Related Posts