ఏపీలో బీజేపీ పేరు ఎత్తితేనే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.ఏపీలో మారుతున్న సమీకరణాలు, రాజకీయ పరిణామాలు బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారంతా తలోదారి చూసుకుంటున్నారు. మొన్నటివరకూ మోదీ-అమిత్ షా వ్యూహాలతో ఆకాశంలో తేలిపోయిన నేతలకు ఇప్పుడు వాస్తవ పరిస్థితి భయాందోళనలు మొదలయ్యాయి. ఏపీలో పార్టీ పరిస్థితి దిగజారిపోయింది విభజన హామీలు నెరవేర్చలేకపోవడంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడంతో ఆ పార్టీ కి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాని మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు యుద్ధం ప్రకటించడం, ఇచ్చిన హామీల అమలులో మోసం చేసిందంటూ ఆయన పదేపదే విమర్శలు గుప్పిస్తుండటంతో బీజేపీ భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఇక ఆ పార్టీని నమ్ముకుంటే తామ రాజకీయ జీవితానికి సమాధి కట్టుకున్నట్టేననే అభిప్రాయం ఏపీ బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇంకా పార్టీలో ఉంటే కష్టమేనని నేతలందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో బీజేపీ నుంచి కమలనాథులు ఒక్కొక్కరూ జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీల నేతలతో టచ్‌లో ఉండగా.. మరికొందరు ఏ పార్టీలో చేరాలో తేల్చుకునే దశలో ఉన్నారు. ఇక రేపో మాపో కమలదళం ఖాళీ అయిపోతుందనే చర్చ మొదలైంది. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో విశాఖ నుంచి హరిబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా ఆ ఛాయలు కనిపించలేదు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు విశాఖలో కమలం వికసించింది. విశాఖ నుంచి రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఆ తర్వాత చలపతిరావు కుమారుడు మాధవ్ కూడా టీడీపీ సాయంతోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఇలా విశాఖలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఓ ఎమ్మెల్సీ బీజేపీ ఖాతాలోకి వచ్చాయి. ఇదంతా చూసి విశాఖలో బీజేపీ బలం పెరిగిందనుకున్నారు. అయితే ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. పార్టీలో ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటోన్న వారిలో కూడా విశాఖ ఎంపీ హరిబాబు టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మనిషి. ఇక విష్ణుకుమార్ రాజు చూపులు వైసీపీ వైపు ఉన్నాయంటున్నారు. విష్ణు జగన్ పాదయాత్ర విశాఖకు వస్తే తాను కలవడం గ్యారెంటీ అని చెప్పేశారు. ఇక మిగిలిన నాయకులు కూడా తమ దారి తాము చూసుకునేందుకు రెడీగా ఉన్నట్టే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రధాన నాయకులే లేకపోతే మిగిలిన వారి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.విభజన హామీలు అమలు చేయకపోవడం, హోదాను పక్కన పెట్టేయడం, రైల్వే జోన్ ఊసే ఎత్తకపోవడం అసలు ఏపీని పెద్దగా పట్టించుకోకపోవడంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది.. డెస్టినీ సిటీ విశాఖలో మరీ ఘోరంగా తయారైంది. కార్పొరేషన్‌గా విశాఖ అవతరించినప్పుడు తొలి మేయర్ స్థానాన్ని గెల్చుకున్నది బీజేపీనే! 1981లో ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి సారథ్యంలోని బీజేపీ పాతికకుపైగా సీట్లను సాధించి మొదటి మేయర్ పదవిని చేపట్టింది. తర్వాత ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ తండ్రి చలపతిరావు కూడా రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడూ విశాఖలో బీజేపీ జెండా ఎగరలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వైపు మొగ్గుచూపిన కొందరు ఇప్పుడు అటువైపు చూడటం మానేశారు. 2014లో పార్టీలో చేరిన ఆడారి కిశోర్‌కుమార్‌కు బీజేవైఎం జాతీయ కార్యవ ర్గంలో చోటు కల్పించారు. టీడీపీ కటీఫ్ చెప్పిన తర్వాత ఆ పదవిలో ఉంటూనే బీజేపీకి వ్యతిరేకంగా కమలం కండువా వేసుకుని మరీ ఆందోళనలు చేశారు! ఇప్పుడు బీజేపీలో ఉన్నది పాత కాపులే తప్ప మధ్యలో పార్టీలో చేరిన వారెవ్వరూ లేరు. వారంతా తలోదారి చూసుకున్నారు. రేపొద్దున అధిష్టానం తమకు టికెట్లు ఇచ్చినా జేబు ఖాళీ అవ్వడమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. విశాఖ నీటి సమస్యపై ఆందోళన చేస్తే పట్టుమని 30 మంది కూడా లేరట! ఇక మోడీ దీక్షకు మద్దతుగా ఇక్కడ కూడా దీక్షా కార్యక్రమం పెడితే ఓ మూడు వందల మంది మాత్రమే వచ్చారట! వారంతా ఆది నుంచి కాషాయజెండా మోస్తున్నవారేనట! ‘అప్పుడూ మేమే ఉన్నాం. ఇప్పుడు మేమే ఉన్నాం. మధ్యలో వచ్చినవారే బాగుపడ్డారు’ అంటూ నిట్టూర్పు విడిచారట! ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు! వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. కొత్త సారథిని నియమించలేదంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని కమల దళ సభ్యులే అంటున్నారు.