YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొంప ముంచిన వలస నేతలు

కొంప ముంచిన వలస నేతలు

కోల్ కత్తా, మే 22, 
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించింది. బెంగాల్ తమదే నన్న ధీమాలో బీజేపీ ఎన్నికల రంగంలోకి దిగినా ఊహించని ఫలితాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడేళ్ల నుంచి పడిన శ్రమ వృధా అయిందేనన్న ఆవేదన బీజేపీ నేతల్లో కన్పిస్తుంది. మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి మమతబెనర్జీ పై పోరాటం చేయడం తప్ప సాధించేదీమీ లేదు. అయితే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలను ఓటమి నుంచి బయటపడాలని కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తుంది.పశ్చిమ బెంగాల్ పై ఎన్నికల ఫలితాల ముందు వరకూ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అధికారం తమదేనన్న ధీమాలో ఉంది. దీనికి కారణం పదేళ్ల మమత బెనర్జీ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్, కమ్యునిస్టులు ప్రభావం ఏమీ లేకపోవడంతో గెలుపు పై భారీగా నమ్మకం పెట్టుకుంది. అందుకోసమే మూడేళ్ల నుంచి మోదీ, అమిత్ షాలతో పాటు కీలక నేతలందరూ బెంగాల్ చుట్టూనే తిరిగారు. మమత బెనర్జీ ని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు.దాదాపు నలభై మంది టీఎంసీ నేతలను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. అదే ఇప్పుడు పార్టీ కొంప ముంచిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీ మారి వచ్చిన వారందరికీ టిక్కెట్లు కేటాయించాల్సి రావడం, అక్కడ తొలి నుంచి ఉన్న బీజేపీ నేతలు సహకరించకపోవడం వల్లనే ఓటమి ఎదురయిందని కొందరు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. సువేందు అధికారి లాంటి నేతలు మినహా దాదాపు మిగిలిన వారందరూ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదని చెబుతున్నారు.దీంతో పశ్చిమ బెంగాల్ లో వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావాలని కేంద్ర నాయకత్వం ఇప్పటి నుంచే పార్టీ నేతలకు సూచిస్తుంది. ఫలితాల అనంతరం చెలరేగిన హింసలో దాదాపు 11 మంది బీజేపీ కార్యకర్తలు హతమయ్యారు. వారందరినీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఓడినా ఓటింగ్ శాతం, సీట్ల సంఖ్యను పెంచుకోవడం కొంత ఊరట కల్గించినా, చేసిన తప్పులపై ఇప్పుడు పశ్చాత్తాపం ఆ పార్టీ అగ్రనేతల్లో మొదలయిందంటున్నారు.

Related Posts