కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచే అమిత్‌షా తడబాబు.. ఎడబాటు కొనసాగుతూనే ఉంది. పొరపాట్లు..గ్రహపాట్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలు, సమావేశాల్లో ఆయన నోరుజారి జోకర్‌గా మారారనే సెటైర్లు వైరల్ అయ్యాయి. అమిత్‌షా ప్రసంగాన్ని కన్నడలోకి తర్జుమా చేసే వ్యక్తి ఏకంగా మోడీనే విమర్శించారు. దేశాన్ని మోడీ నాశనం చేస్తున్నారంటూ అనడం మరో జోక్‌గా నిలిచిపోయింది. అలాగే మైనింగ్ అక్రమాల కేసులో రెండేళ్లపాటు జైలుపాలై వచ్చిన గాలి జనార్దన్‌రెడ్డకి తమ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని మొదట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. దీనిపై గాలి వర్గీయులు మండిపడ్డారు. వెంటనే గాలి జనార్దన్‌రెడ్డి తన అనుచరులతో సమావేశమై ఏకంగా తన సోదరుడిని రెబల్‌గా దించేందుకు కూడా సిద్ధమయ్యారు.ఓ సమావేశంలో కాంగ్రెస్ నేత, సీఎం సిద్దరామయ్యను విమర్శించబోయి సొంతపార్టీ నేత, సీఎం అభ్యర్థి యడ్యూరప్పపైనే ఆరోపణలు చేశారు. యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అంటూ నోరుజారారు. అప్పట్లో ఇది వైరల్ అయింది.బళ్లారి, తదితర ప్రాంతాల్లోని 27నియోజకవర్గాల్లో గాలి సోదరులకు మంచి పట్టుఉంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. గాలిని కాదంటే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం ఉంటుందనే వాదన ఎక్కువైంది. ఈ క్రమంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా గాలి వర్గానికి పెద్ద పీట వేశారు. ఏకంగా తొమ్మిదిమంది అనుచరులకు టికెట్లు దక్కాయి. అప్పుడే తెలిసిపోయింది కర్ణాటకలో అమిత్‌షావి ఉత్త గాలిమాటలేననే విమర్శలు వచ్చాయి. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బళ్లారి పర్యటన రద్దు అయింది. బళ్లారిలో పార్టీ నిర్వహించే ర్యాలీలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉండగా..అర్థంతరంగా అమిత్‌షా పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే వివాదాస్పద మైనింగ్ వ్యాపారులైన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులతో బహిరంగ సభ వేదికను పంచుకునే పరిస్థితి ఉండడంతోనే ఆయన రాలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి సోదరులైన కరుణాకర్‌రెడ్డి, సోమశేఖరరెడ్డిలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. అయితే జనార్దన్‌రెడ్డికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి సోదరులతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనీ, కాంగ్రెస్ నుంచి విమర్శలు తప్పవనీ గ్రహించిన అమిత్‌షా తన బళ్లారి పర్యటనను రద్దు చేసుకున్నారని పలువురు నాయకులు అంటున్నారు.