హైదరాబాద్, మే 22,
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్ తో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మెట్రో రైల్ ఆక్యుపెన్సీ.. ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బకు మరింత దయనీయంగా తయారైంది. లాక్ డౌన్ విధించాక.. లిమిటెడ్ టైమ్ పర్మిషన్ ఉన్నా సరే.. ఎవరూ ధైర్యం చేసి ప్రయాణం చేయటం లేదు. దీంతో మెట్రో రైల్ ఆదాయం దాదాపు నిల్ అయిపోయింది. దీంతో లాక్ డౌన్ ఎత్తేసేవరకు పూర్తిగా సర్వీసులు రద్దు చేయాలనే యోచనలో మెట్రో రైల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న నష్టాలకు తోడు.. ఇలా ఖాళీగా రైళ్లు నడపటం మరింత భారం మోపుతుందని వారు భావిస్తున్నారు. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు.. లాక్ డౌన్ విధించగానే మెట్రో రైల్ సర్వీసులు ఆగిపోయాయి. దాదాపు కొన్ని నెలలకు పైగా మెట్రో రైళ్లు కదలలేదు. తర్వాత మెల్లగా ఒక్కొక్కటి ఓపెన్ చేసిన కేంద్రం మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా కదిలిన మెట్రో రైలు ముచ్చటగా ఐదు నెలలు నడిచిందో లేదో సెకండ్ వేవ్ వచ్చి పడింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూగా అమలు చేస్తుండటంతో.. ఆ ఐదు నెలలు కూడా పెద్దగా ఆదాయం లేదు. సిటీలోని చాలామంది ఊళ్లకు వెళ్లిపోయి.. అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు సైతం ఉద్యోగాలను కోల్పోయి ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో మెట్రో రైల్ ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయింది.. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చాక.. పరిస్ధితి మరీ ఘోరంగా తయారైంది. అందుకే లాక్ డౌన్ ఎత్తేసేవరకు మెట్రో రైల్ కదలకపోవడమే బెటరనే అభిప్రాయానికి మెట్రో రైల్ అధికారులు వచ్చారు. రేపో మాపో ఆ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.