వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు.
*మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది.*
ఒకసారి శ్రీకృష్ణుడు పాండవ అగ్రజుడు ధర్మరాజుకు వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను వివరించాడు...
శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమస్త పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు...
"వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు "
శ్రీరామా ! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. అది ఏంతో మంగళకరమైనది.
*ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు , దుఃఖాలు , మాయ పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెపుతాను విను'' అని అన్నాడు...*
పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి శమనుడు , ద్యుతిమానుడు , మేధావి , సుకృతి , దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో దుష్టబుద్ధి పరమపాపి , కుమతి , చెడుప్రవర్తన కలిగినవాడు ఆయిన దుష్టబుద్ధి వేశ్యాసాంగత్యం కలిగినవాడై , మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు. ఇక ప్రాణులను చంపడంలో , హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణకు గురి అయిన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను , పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రాణహింస చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం , ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషివస్త్రం నుండి ఒక నీటిచుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి ముకుళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. “. వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరుపర్వతం అంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది... కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు''అని తెలిపాడు... కౌండిన్యఋషి చెప్పిన మాటలను విన్న దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు ఆ వ్రత ఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు.
ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది.
తీర్థస్నానం , దానం , యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు...
మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి...
శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి...
*హరి నామస్మరణం - సమస్త పాపహరణం *
*శుభమస్తు*
సమస్త లోకా సుఖినోభవంతు