ఒకసారి శ్రీమహా విష్ణువు వాహనమైన గరత్మంతుడికి అహంకారం పెరిగిపోయింది. తాను దేవదేవుడైన ఆ శ్రీమహా విష్ణువు వాహనమని, ఆ విష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా తన పైనే వెళ్లాలని, ఆ దేవదేవుని బరువంత తనే తన బుజ స్కందాలపైన మోస్తున్నానని, అహంకరించేవాడు. ఆ అహంకారం వల్ల వైకుంఠానికి వచ్చే ఇతర దేవతల దగ్గర దురుసుగా ప్రవర్తించేవాడు. ఎవరికీ అంతగా మర్యాద ఇచ్చేవాడు కాదు. అందరిని తనకన్నా తక్కువగా చేసి మాట్లాడేవాడు. అందువల్ల కొందరు దేవతలు చిన్నబోయేవారు. విషయాన్ని గ్రహించిన ఆ విష్ణువు గరత్మంతుడిలో పేరుకుపోయిన గర్వాన్ని మొగ్గ దశలోనే తుంచివేయాలి. లేదంటే ఇది ఇందాక దారి తెస్తుందో... అనుకుని సమయం కోసం చూడసాగాడు. ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు వైకుంఠానికి కొందరు దేవతామూర్తులు వచ్చి విష్ణువుతో సంభాషించుతుండగా విష్ణువు గరత్మంతుణ్ణి చూసి ఇటు రా అన్నట్లుగా సైగ చేసాడు. గరత్మంతుడు వచ్చి విష్ణువు ఎడమ చేతి వైపు నిలబడతాడు. విష్ణువు ఆ దేవతలతో... సంభాషిస్తూ, సంభాషిస్తూ, అయన ఎడమ చేయి గరత్మంతుని మీద వేస్తాడు. విష్ణువు చేయి గరత్మంతుని మీద పడగానే గరత్మంతుడు ఆనందనతో ఉప్పొంగుతాడు. అలా కొద్దిసేపు గడిచిందో... లేదో... గరత్మంతుని మీద వున్న విష్ణువు చేయి బరువెక్కడం మొదలు పెడుతుంది. నిమిష నిమిషానికి ఆ బరువు పెరిగిపోవడంతో... గరాత్మంతుడు మోయలేక, తీయమనలేక ఇబ్బంది పడుతూ, సహిస్తూ, సహిస్తూ నా వల్ల కాదు బాబోయ్ అన్నట్లుగా కళ్ళు తిరిగి పడిపోతాడు. కొంతసేపటికి గరత్మంతుడు కళ్ళు తెరిచి చూడగా... అయన విష్ణువు ఒడిలో వున్నాడు. విష్ణువు ప్రేమగా అయన తల నిమురుతున్నాడు. ఆ సమయంలో గరత్మంతుడు.... ఆ విష్ణువు ఎడమ చేతినే నేను మోయలేక పోయాను... మరి ఇంతకాలం ఆయన బరువెల మోస్తున్నాను. అంటే... ఆ గొప్పతనం నాదికాదు. అయన నాపై చూపించే కరుణ మాత్రమే. అని భావించి, ఆ విష్ణువు ముందు రెండు చేతులు జోడించి మహాశయా మహానుభావ పరమపురుషా... నా అజ్ఞానాన్ని మన్నించు. అని వేడుకొనగా... విష్ణువు అయన అభయ హస్తంతో ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి గరత్మంతుడు ఎవ్వరినీ చిన్న చూపు చూడకుండా సద్భుద్ధి తో మెదులుతు విష్ణువు కృపకు పాత్రుడవుతాడు...