మనం చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం ఏ రూపంలో ప్రకటించబడుతుంది? పుణ్యం ఎలా ప్రకటించబడుతుంది?
ఈశ్వరుఁడు మంచి నైపుణ్యం గల వ్యవసాయదారుడు. మొదలు మన మనస్సు అనే నేలను సాధన అనే నాగలితో దున్ని ఆ తరువాత పుణ్యం అనే విత్తును నాటుతాడు తద్వారా తన కటాక్షవీక్షణాలనే ఫలాలను అందిస్తాడు. పుణ్యం అనేది ఫలం కాదు , పుణ్యం అనేది సత్ఫలానికి కారణం పుణ్యం అనేది విత్తనమైతే మనసులో కలుగుతున్న మంచి మార్పు ఎదుగుతున్న వృక్షం లాంటిది. అలా మారిన మనసు అందుకునే భగవంతుడి వాత్సల్యానుభూతియే వృక్షానికి పండిన ఫలం. మనం చేసిన ధర్మకార్యం ఫలించిందాలేదా అనే సందేహాన్ని మన మనస్సే నివృత్తి చేస్తుంది సన్మార్గం దిశగా ప్రయాణిస్తున్న మన మనస్సే చెబుతుంది మనం గెలిచామని ఈ మంచి మార్పే క్రమేపీ సాధకుడిని మహనీయుడిగా మారుస్తుంది. పూజలు ,పారాయణాలు, దీక్షలు, జపాది ఇత్యాదులు సిద్ధించుకున్న సాధకుడిలో అప్రయత్నంగానే* *"క్షమా, సహనం , సామరస్యం, భూతదయ, ప్రేమ, దైవిక జ్ఞానం ఇలాంటి సుగుణాలు పెంపొందించబడతాయి ఇదియే నిజమయిన సాధన. కోటి పూజలు చేసినా, లక్ష పారాయణాలు చేసినా, వేల జపాలు చేసినా గోరంత కూడా మనలో మంచి మార్పు రాలేదంటే, ఆ సాధన బండరాయి మీద నాటిన విత్తనం లాంటిదే. పుణ్యానికి మన మనస్సే గమ్యస్థానం. మనసులో వచ్చే మార్పే జీవితాన్ని మారుస్తుంది. మట్టి బెడ్డలోనుండి వచ్చే సువాసనకు వర్షపు చినుకు కారణమైనట్లు మన మనస్సులోని సుగుణాల వెలికితీతకు చేసిన ధర్మకార్యాల పుణ్యమే కారణం. రాజు యొక్క రాకను తెలియపరిచి సభలోని వారిని క్రమశిక్షణలో పెట్టిన బంటు మాదిరి , భగవదనుగ్రహం వచ్చేముందు ఆవశ్యకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనసుకు అలవాటు చేసేదే పుణ్యం. అందుకే మనం చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం సాధకుడి మనసును సారవంతం చేసి తనను తాను ప్రకటించుకుంటుంది. కొబ్బరికాయలు కొట్టి, కాయకొక కోరికచొప్పున "కోరికల దండకాలు" చదివే బదులు *ఫలాపేక్ష లేకుండా పరంధాముడిని ధ్యానిస్తే /పూజిస్తే పుణ్యాన్ని ప్రసాదించి మన మనస్సునే వైకుంఠంగా చేసుకుంటాడు.