లక్నో మే 23,
తన ఇంటి బయట కూరగాయలు విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు లాక్కెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఫలితంగా అతడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలోని బంగర్‌మవు పట్టణంలో జరిగిందీ ఘటన. ఇంటి బయట కూరగాయలు విక్రయిస్తున్న యువకుడిని చూసిన పోలీసులు కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణ రహితంగా చావబాదారు. దీంతో యువకుడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి మృతదేహంతో ఉన్నావో-బంగర్‌మవు-హర్దోయి రహదారిపై ధర్నాకు దిగారు. యువకుడి మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నినదించారు.పోలీసుల తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని తెలిపారు.