YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అందుబాటులోకి 8 టీకాలు ఒక్కో టీకాది ఒక్కో కథ

అందుబాటులోకి 8 టీకాలు ఒక్కో టీకాది ఒక్కో కథ

న్యూఢిల్లీ, మే 24, 
కరోనాపై పోరాటంలో మన కొవాగ్జిన్.. రష్యా నుంచి స్పుత్నిక్.. బ్రిటన్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్.. అమెరికాలో పైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్.. ఇలా అధికారికంగా 8 దాకా కరోనా టీకాలు వచ్చాయి. రకరకాల ఫార్ములాలు, పద్ధతులతో కంపెనీలు వాటిని తయారు చేశాయి. ఓ కంపెనీ చనిపోయిన పూర్తి వైరస్తో టీకాను తయారు చేస్తే.. మరో కంపెనీ ఆ వైరస్లోని జీన్ను తీసుకుని చేస్తోంది. ఫార్ములా ఏదైనా టీకా టార్గెట్ మాత్రం ఒక్కటే.. కరోనాను ఖతం పెట్టడమే! మరి, ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సిన్ల ఫార్ములాలేంటి? అవెలా పనిచేస్తాయి?  మన దేశంలో తయారైన మొట్టమొదటి లోకల్ కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సాయంతో భారత్ బయోటెక్ టీకాకు రూపమిచ్చింది. కరోనా వైరస్తోనే అభివృద్ధి చేసిన టీకా ఇది. అయితే, మొత్తం వైరస్ను లోపలికి ఎక్కించడమంటే ప్రమాదం కదా అని అనుకోవచ్చు.. కానీ, మన ఒంట్లో వైరస్ మరింత ముదిరిపోకుండా ఉండేందుకు దానిని చంపేస్తారు. వీరోసెల్ టెక్నాలజీతో పెద్ద మొత్తంలో వైరస్ను సృష్టించి.. ఆ మొత్తం వైరస్లను బీటా ప్రొపియోలాక్టోన్ అనే ద్రావణంలో ఉంచి ఇనాక్టివ్ చేస్తారు. అలా చనిపోయిన వైరస్కు అల్యూమినియం అడ్జువెంట్ను కలిపారు. మామూలుగా వ్యాక్సిన్ల పనితీరు మెరుగ్గా ఉండేందుకు, ఇమ్యూన్ సిస్టమ్ వేగంగా స్పందించి మరిన్ని యాంటీ బాడీలు తయారయ్యేందుకు ఈ అడ్జువెంట్లు ఉపయోగపడతాయి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్ కాంబినేషన్లో తయారైన అడ్జువెంట్ను కొవాగ్జిన్లో వాడడం వల్ల.. వైరస్పై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మామూలుగా ఇప్పటిదాకా ఉన్న వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇస్తున్నారు. రెండు డోసులకూ అదే టీకా వేస్తున్నారు. అయితే, స్పుత్నిక్ వీ విషయంలో మాత్రం ఆ రెండు డోసులూ వేర్వేరు. ఏడీ26, ఏడీ5 అనే రెండు డోసులగా టీకాను గమేలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) కలిసి తయారు చేశాయి. రెండు డోసులూ అడినోవైరస్ వెక్టార్లుగానే తయారు చేసినా.. వేర్వేరు అడినోవైరస్లను వాడారు. మొదటి డోస్లో భాగంగా స్పైక్ ప్రొటీన్ను ఏడీ26 వెక్టార్లో, రెండో డోస్లో ఏడీ5 వెక్టార్లో పెట్టి టీకాకు రూపమిచ్చారు. ఏడీ26 తీసుకున్న తర్వాత కణాల్లోకి వైరస్ ప్రొటీన్ జీన్ విడుదలై యాంటీబాడీలు తయారవుతాయి. మళ్లీ 21 రోజుల తర్వాత రెండో డోస్ కింద ఏడీ5 ఇస్తారు. దీంతో ఇమ్యూనిటీ మరింత స్ట్రాంగ్ అయి మరిన్ని యాంటీబాడీలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇదే ఫార్ములా సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్ లైట్నూ రష్యా తయారు చేసింది.
ఫైజర్ ఎంఆర్ఎన్ఏ టీకా.. కష్టమైన ఫార్ములా
ఎంఆర్ఎన్ఏ’.. వ్యాక్సిన్లలో అద్భుతమైన టెక్నాలజీ అని సైంటిస్టులు చెప్తారు. ఆ టెక్నాలజీతోనే అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్టెక్ కంపెనీలు కలిసి బీఎన్టీ162బీ2 అనే కరోనా వ్యాక్సిన్ను అనే వ్యాక్సిన్ను తయారు చేశాయి. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లలో ఇదే కాంప్లెక్స్ (సంక్లిష్టమైన) ఫార్ములా అని అంటారు. కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్లోని జీన్ను తీసి దానిని ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ)గా మార్చి టీకా తయారు చేశారు. అంటే ఇది ఒంట్లోకి వెళ్లగానే వేగంగా ఇమ్యూన్ సిస్టమ్ స్పందిస్తుంది. ఆ వైరస్ జీన్ను పక్కాగా కణంలోకి విడుదల చేసేందుకు గానూ 4 హైడ్రాక్సీబ్యుటైల్ అజానిడైల్ బిస్ హెక్సేన్ 6,1‌‌‌‌–డైల్ బిస్ (ఏఎల్సీ 3015), 2 హెక్సైల్డెకానోయేట్,2–పాలీఇథిలీన్ గ్లైకాల్–2000ఎన్,ఎన్డై టెట్రాడెకైల్ఎసిటమైడ్(ఏఎల్సీ 0159), 1,2–డైస్టీరాయిల్ఎస్ఎన్గ్లిసరో–3–ఫాస్ఫోకొలీన్ (డీపీఎస్సీ), కొలెస్ట్రాల్అనే 4 లిపిడ్లను కలిపి వాహకంగా వాడారు. ఈ లిపిడ్లు వైరస్ జీన్ను పట్టి ఉంచుతాయి. వ్యాక్సిన్ తీసుకునే ఓ వ్యక్తి శరీరంలోని పీహెచ్కు తగ్గట్టు వ్యాక్సిన్ పీహెచ్ను మెయింటెయిన్ చేసేందుకు ఫాస్ఫేట్ బఫర్డ్ సాల్ట్స్ (పీబీఎస్– ఉప్పు (సోడియం క్లోరైడ్), పొటాషియం క్లోరైడ్, మోనోబేసిక్ పొటాషియం క్లోరైడ్, బేసిక్ సోడియం ఫాస్ఫేట్ డై హైడ్రేట్)ను వాడారు. అందుకే వ్యాక్సిన్ను మైనస్ 73 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి వస్తోందని సైంటిస్టులు చెప్తున్నారు. మరి, అంత చల్లటి వాతావరణంలో వ్యాక్సిన్ను పెడితే గడ్డ కట్టిపోదా అంటే.. అది జరగకుండా ఉండేందుకు ‘సుక్రోజ్’ అనే చక్కెరను కలిపారు. దీంతో వైరస్లోని నానోపార్టికల్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా, టీకా గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది. ఇక, అంతా అయిపోయాక ఓ వ్యక్తికి టీకా వేసే ముందు కూడా ఆ వ్యాక్సిన్ను నార్మల్ సెలైన్లో వ్యాక్సిన్ను మిక్స్ చేసి ఇస్తారట. అది కూడా మన రక్తంలోని ఉప్పు మోతాదుకు అటూఇటూగా ఉండేందుకేనట. వ్యాక్సిన్ను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఎలాంటి ప్రిజర్వేటివ్లనూ వాడలేదు. ఇక కే986పీ, వీ987పీ అనే రెండు ప్రోలీన్ సబ్స్టిట్యూట్ల వల్ల ఇతర కరోనా వేరియంట్లపైనా బాగా పనిచేస్తుందట.
జాన్సన్ అండ్ జాన్సన్
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఫార్ములా స్పుత్నిక్ వీ ఫార్ములానే. అయితే, రెండు డోసులుగా కాకుండా కేవలం ఒకే ఒక్క డోసులోనే కంపెనీ టీకాను ఇస్తోంది. ఏడీ26 వెక్టార్లో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లోని జీన్ను ఎన్కోడ్ చేసి పెట్టారు. మ్యుటేషన్ జరిగిన వేరియంట్లనూ గుర్తించేందుకు వీలుగా ఆ స్పైక్ ప్రొటీన్లోని రెండు అమైనోయాసిడ్లను తీసేసి వాటి ప్లేస్లో ప్రోలీన్లను పెట్టారు. సిట్రిక్ యాసిడ్ మోనోహైడ్రేట్, ట్రైసోడియం సిట్రేట్ డై హైడ్రేట్, ఇథనాల్ (ఆల్కహాల్), 2 హైడ్రాక్సీప్రొపైల్ బీటా సైక్లో డెక్స్ట్రిన్ (హెచ్బీసీడీ), పాలీసార్బేట్ 80, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్లను కలిపారు.
వైరస్ జీన్తో కొవిషీల్డ్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) కలిసి తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఫార్ములా ‘చేడాక్స్1 ఎన్కొవ్19’. చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే అడినోవైరస్లను వెక్టార్లుగా వాడారు. కరోనా వైరస్లోని స్పైక్ ప్రొటీన్లో ఉండే జీన్స్ను ఆ వెక్టార్లో పెట్టారు. వ్యాక్సిన్ను వేయగానే ఆ అడినోవైరల్ వెక్టార్.. కణాల్లోకి వెళ్లి జీన్ను విడుదల చేస్తుంది. శరీర కణాలు ఆ జీన్ను మళ్లీ ఎంఆర్ఎన్ఏగా ఆ తర్వాత ప్రొటీన్లుగా మారుస్తుంది. ఆ వైరస్ ప్రొటీన్లను ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఇక, బ్లడ్ క్లాట్స్ను బ్రేక్‌  చేసేందుకు టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్నూ వ్యాక్సిన్లో కలిపారు.
మోడర్నా– ఎంఆర్ఎన్ఏ1273
ఫైజర్లోని ఎంఆర్ఎన్ఏ ఫార్ములానే మోడర్నా కూడా వాడింది. లిపిడ్ల వరకు దాదాపు అంతా ఒకే ఫార్ములా అయినా.. కొన్ని మార్పులు చేసింది. బఫర్లుగా ట్రోమీథమైన్, ట్రోమీథమైన్ హైడ్రోక్లోరైడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం ఎసిటేట్లను వాడింది. టీకా గడ్డకట్టకుండా సుక్రోజ్నూ వినియోగించింది. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫైజర్ ఎంఆర్ఎన్ఏ ఫార్ములానే.
కొవాగ్జిన్ ముక్కు టీకా (బీబీవీ154)
మామూలు కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్తో పోలిస్తే ముక్కు ద్వారా వేసే కొవాగ్జిన్ (బీబీవీ154) ఫార్ములా పూర్తిగా వేరు. అందులో పూర్తిగా వైరస్నే తీసుకుంటే.. ఇందులో మాత్రం కేవలం వైరస్లోని జీన్నే తీసుకున్నారు. ఆ జీన్ను మనకు చెడు చేయని మరో వైరస్ వాహకం (వెక్టార్)లో పెట్టి బీబీవీ154కు రూపునిచ్చారు. ఇందులో కరోనా వాహకంగా చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే అడినోవైరస్ను వాడారు.
కొవిషీల్డ్:
అడినోవైరస్ వెక్టార్లో స్పైక్ ప్రొటీన్ జీన్ను చేర్చి చేసిన వ్యాక్సిన్
కొవాగ్జిన్:
కరోనా వైరస్ను చంపి తయారు చేసిన టీకా ఇది.
జాన్సన్:
ఓ రకం అడినో వైరస్లో కరోనా జీన్ను పెట్టి ఒకే డోసు టీకా.
స్పుత్నిక్ వీ
రెండు రకాల అడినోవైరస్లతో రెండు డోసుల టీకా.

Related Posts