న్యూ ఢిల్లీ మే 24
అంతా హాలివుడ్ సినిమా తరహాలో జరిగింది. గ్రీసు రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్‌కు 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణికులతో వెళుతున్న ‘ర్యాన్ ఎయిర్’ విమానం బెలారూస్ మీదుగా వెళుతున్నది. మరికొద్ది సేపట్లో గమ్యం చేరుకుంటామని ప్రయాణికులు అనుకుంటున్నారు. కానీ ఇంతలో బెలారూస్ అధికారులు విమానంలోని సిబ్బందిని కాంటాక్ట్ చేశారు. అందులో బాంబు ఉన్నట్టు చెప్పారు. వెంటనే బెలారూస్ లో దిగాలని ఆదేశించారు. ఎస్కార్టుగా ఓ యుద్ధ విమానాన్ని కూడా పంపారు. పాపం పైలట్ ఏం చేస్తారు? విమానాన్ని బెలారూస్ రాజధాని మిన్స్క్ లో దింపారు. అప్పుడు బెలారూస్ అధికారులు బాంబు తనిఖీ నెపం మీద విమానంలోకి ఎక్కి రోమన్ ప్రొటాసెవిచ్ అనే వ్యక్తిని తమ వెంట తీసుకుపోయారు. ఆయన ఎవరో కాదు బెలారూస్ సీనియర్ జర్నలిస్ట్. బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో విధానాలను తూర్పారబట్టడంలో దిట్ట. ఆ కారణంగా ఆయనపై అనేక కేసులు నమోదయ్యయి. ఇన్‌స్టాగ్రాంలో అధ్యక్షునికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నందుకు టెర్రరిజంతో సహా అనేక కేసులు పెట్టారు. దాంతో ప్రొటాసెవిచ్ విదేశాల్లో తలదాచుకుంటున్నారు. విమానంలో బెలారూస్ అధికారులు తనను తీసుకువెళుతున్నప్పుడు ప్రొటాసెవిచ్ తనకు మరణ శిక్ష విధిస్తారని బాధపడ్డాడట. బెలారూస్ జరిపిన ఈ దుస్సాహస చర్యపై ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. దారిదోపిడీ, కిడ్నాప్ వంటి ఆరోపణలతో బెలారూస్‌పై తీవ్రమైన ప్రకటనలు విడుదల చేశాయి. ఈ వ్యవహారం ఆంక్షల దాకా పోతుందని భావిస్తున్నారు. తన నిర్దేశిత మార్గంలో తాను పోతున్న విమానాన్ని ఇలా దారిమళ్లించడం అరుదైన ఘటనే.