హైదరాబాద్, మే 24,
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చేసుకుంది. సీఎం కేసీఆర్‌కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కెసిఆర్ కు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు. దీంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి తన భూమిని ఆక్రమించుకొన్నారని మహేష్ ముదిరాజ్ వీడియోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. తనకు న్యాయం చేయాలని కూడ ఆ వీడియోలో కోరాడు.దీంతో తనకు అందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు. ఇప్పటికే ఈటల భూకబ్జా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.మాసాయిపేట, హాకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములను ఈటల భార్య జమున నడుపుతున్న హేచరీస్ సంస్థ ఆక్రమించుకొంది. ఈ విషయమై విచారణ సాగుతోంది. మరోవైపు దేవర యంజాల్ భూమిలో దేవాలయ భూములను కూడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఐఎఎస్‌ల కమిటీ విచారణ చేస్తోంది. ఇప్పుడు కుమారుడిపై భూకబ్జా ఆరోపణలు రావడంతో.. ఈటల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.