YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఆరు గ్రామాలపై ఇంకా రాని క్లారిటీ

ఆ ఆరు గ్రామాలపై ఇంకా రాని క్లారిటీ

పోలవరం ముంపు ప్రాంతం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2015 ఏప్రిల్ 23న వెలువరించిన గెజిట్‌లో ఉన్న లీగల్ ఇబ్బందులపై ఏం చేయాలో తెలియక ఈసీ మల్లగుల్లాలు పడుతోంది.పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్’ పేరుతో ఒక ఉత్తర్వు (గెజిట్)ను వెలువరించింది. భద్రాచలం రెవిన్యూ గ్రామం మినహా మండలాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు అందులో (జిఎస్‌ఆర్ 311 ఇ) హోం మంత్రిత్వశాఖ పేర్కొనింది. ఆ ప్రకారం భద్రాచలం రెవిన్యూ గ్రామం యధావిధిగా భద్రాచలం (ఎస్‌టి) నియోజకవర్గంలోనే ఉండిపోయింది. కానీ ఆ మండలంలోని మిగిలిన గ్రామాలు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమయ్యాయో ఆ గెజిట్‌లో స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం (ఎస్‌టి) అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న నెల్లిపాక మండలం ఏ విధంగానూ ప్రభావితమైనది కానందున రెండు రాష్ట్రాల్లోని ఎస్‌సి,ఎస్‌టి నియోజకవర్గాల విస్తీర్ణాన్ని, భౌగోళిక హద్దులను నిర్ణయించడం అసాధ్యంగా మారిందని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శికి రాసిన లేఖ (నెం. 282/ఏపి/2017 (డిఇఎల్)/490, ఫిబ్రవరి 8, 2018)లో వివరించింది తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు వెలువరించిన ఆ గెజిట్‌లో ఈ మండలాల పరిధిలో ని గ్రామాలు ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్తాయో ఒక మేరకు స్పష్టత ఇచ్చినప్పటికీ భద్రచాలం రెవిన్యూ గ్రామం మినహా మొత్తం మండలంలోని గ్రామాలు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్తాయో స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ మండల పరిధిలోని గ్రామాలు నాలుగేళ్ళుగా ఏ రాష్ట్రానికీ చెందకుండా ఉన్నాయి. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఈ ఏడు మండలాల పరిధిలోని గ్రామాలపై రెండు రాష్ట్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలను కోరుతూ లేఖ రాసింది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కూడా వివరమైన నివేదిక ఇవ్వాలని ఈ నెల 19వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వశాఖ రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఏక కాలంలో రెండు వేర్వేరు వ్యవస్థ నుంచి లేఖలు రాయడంతో, వేర్వేరు అంశాలు కావడంతో రాష్ట్ర అధికారులు నివేదిక తయారీపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 23వ తేదీనే కేంద్ర హోం మంత్రిత్వశాఖ లేఖ రాసినప్పటికీ రెండు రాష్ట్రాల నుంచి సరైన వివరాలు రాకపోవడంతో వారం రోజుల క్రితం (ఏప్రిల్ 19) మరో లేఖ రాసింది. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే సూచనలు కనిపించడంలేదని రెండు రాష్ట్రాలూ దాదాపు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి లేఖ రావడం మళ్ళీ ఒక్కసారి కదలిక తెచ్చినట్లయింది పినపాక (ఎస్‌టి) అసెంబ్లీ నియోజకవర్గంలో పొందుపరిచిన మండలాల్లో బూర్గంపాడు మండలాన్ని కూడా హోం మంత్రిత్వశాఖ వివరించినప్పటికీ ఆ మండలం పరిధిలో ఉన్న సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, రావిగూడెం (పెద్ద) గ్రామాలను మాత్రం మినహాయించిదని, అయితే ఈ ఆరు గ్రామాలను ఏ నియోజకవర్గ పరిధిలోకి తీసుకెళ్ళిందో స్పష్టత లేదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఇప్పటికీ ఈ ఆరు గ్రామాలు ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయో స్పష్టత లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణలోని 119అసెంబ్లీ స్థానాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచాలని ఉన్నందున ఆ దిశగా కసరత్తు మొద లు పెట్టినప్పుడు ఈ గ్రామాల గందరగోళం తలెత్తిందని, అందువల్ల ఈ రెండు రాష్ట్రాల్లో నిర్దిష్టంగా ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్‌సికి, ఎన్ని ఎస్‌టికి రిజర్వు చేయాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ లేఖకు కొనసాగింపుగా రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వారం రోజుల క్రితం లేఖలు రాసింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో పెరగాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తిన అంశాలపై అభిప్రాయాలను, వివరణను ఇవ్వాల్సిందిగా రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ నెల 19న లేఖ రాసింది. ఫిబ్రవరిలో రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను కూడా పొందుపర్చాలని సూచించింది. ఫిబ్రవరి 23న రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తిన అంశాలపై అభిప్రాయాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. వీలైనంత తొందరగా వివరాలను అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తరఫున అండర్ సెక్రటరీ ఏకె మనీష్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మండలాలు, గ్రామాల సంగతి తేలితేనే నియోజకవర్గాలను ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడం సాధ్యమవుతుంది.

Related Posts