YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రౌండ్ లోకి వెళితేనే సమస్యలు...

గ్రౌండ్ లోకి  వెళితేనే సమస్యలు...

గుంటూరు, మే 26, 
నిండు పున్నమి వేళ చంద్రుడు కాంతులు చూడతరమా అంటారు కవులు. అలాగే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వైభవం కూడా పౌర్ణమి చంద్రుడిలాగే తళతళలాడేది. కానీ ఓడిన తరువాత మబ్బులు పట్టిన చంద్రుడు అయిపోయారు. సరే మబ్బులు తాత్కాలికం. అవి చెదిరిన నాడు మళ్ళీ వెన్నెల వస్తుంది. పున్నమి కళతో పులకిస్తుంది. మరి చంద్రబాబుని ఆయన తెలుగుదేశం పార్టీని కమ్ముకున్న మబ్బులు వీడిపోయేది ఎన్నడు, ఎపుడు అన్నదే తమ్ముళ్ల చర్చ. అయితే ఏ మబ్బులు అన్న ప్రశ్న కూడా దాని వెనకాలే వస్తోంది మరి.నాయకుడికీ ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉండాలి. కానీ చంద్రబాబు చేసుకున్న పుణ్యమో పాపంమో తెలియదు కానీ అడ్డంగా అనుకూల మీడియా నిలబడిపోయింది అన్న విమర్శలు అయితే ఉన్నాయి. తెలుగుదేశం గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలియనివ్వని కారణంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడారు. ఇక గడచిన రెండేళ్ళ కాలంలో అయినా చంద్రబాబుకు బాకా ఊదుతున్న మీడియా కొంతలో కొంత నిజాయతీగా పనిచేసిందా అంటే అదీ లేదు. జగన్ ఫేక్ సీఎం, ఆయనది గెలుపే కాదు అంటూ చంద్రబాబుని సంతృప్తి పెడుతోంది. మరి ఈ మధ్యన జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీ చావు దెబ్బ తిన్నది. దానిని కూడా మసిపూసి మారేడుకాయ చేసే పనిలోనే అనుకూల మీడియా ఉండడమే దారుణం.ఎంతసేపూ చంద్రబాబుని చాణక్యుడు, దీక్షాదక్షుడు అంటూ పొగడడమే తప్ప క్షేత్ర స్థాయిలో టీడీపీ సీన్ ఏంటి అన్నది కళ్లకు కట్టినట్లుగా చూపించే ధైర్యం అనుకూల మీడియాకు లేదనే అంటున్నారు. చంద్రబాబును ఎన్నుకోక జనాలు తప్పు చేశారు అన్న భావన కల్పిస్తే ఇక టీడీపీ ఆత్మ విమర్శ ఎందుకు చేసుకుంటుంది. అదే సమయంలో జగన్ కి పాలన చేతకాదు, ఆయన ఏ క్షణమైనా జైలు లోకి పోతాడు. ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ అల్లే కధనాలతో సైకిల్ పరుగులు తీస్తుందా అన్నదే పెద్ద డౌట్ అంటున్నారు. వాస్తవాలు తెలియకపోవడం వల్లనే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాన్ని కూడా తప్పుగా టీడీపీ పెద్దలు అర్ధం చేసుకుంటున్నారు.క్షేమం కోరుకునే వారు ఎవరైనా నిజాన్ని నిష్టూరమైనా చెబుతారు. కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వర్గాలు, ఆయన సొంతమని భావించే మీడియా మాత్రం ఆ పని అసలు చేయడంలేదు. ఆ పత్రికల వార్తలు చదివితే ఎన్నికలు ఎపుడు పెట్టినా చంద్రబాబు సీఎం అని తమ్ముళ్ళు ఉప్పొంగిపోవడం ఖాయం. కానీ జనాల్లోకి వెళ్ళి తమ పట్ల ఎందుకు వ్యతిరేక భావం పెంచుకున్నారు, అసలు టీడీపీ ఏ విధంగా తన విధానాన్ని మార్చుకుని జనాలకు చేరువ కావాలి అన్నది కనుక కచ్చితమైన ఆలోచన చేస్తే టీడీపీ పుంజుకుంటుంది. అనుకూల మీడియా చెప్పని నిజం ఏంటి అంటే ఈ రోజుకీ మెజారిటీ జనాల్లో జగన్ పట్ల మోజు ఉంది. మరి ఇది తెలిస్తే కదా తెలుగుదేశం కొత్త స్టెప్ వేసేది. ఆ మబ్బులు వీడేది. మరి మీడియానే తన బలం అనుకుంటున్నా టీడీపీ అధినాయకత్వం అయినా ఈ అడ్డును తొలగించుకుని బయటకు తొంగి చూడగలదా..

Related Posts