న్యూఢిల్లీ, మే 26,
కరోనా వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పిలుస్తున్న గ్లోబల్ టెండర్లు సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 11 రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను పిలిచాయి. అయితే, పలు రాష్ట్రాల రిక్వెస్ట్ లను విదేశీ వ్యాక్సిన్ కంపెనీలు తిరస్కరించాయి. తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికే సప్లయ్ చేస్తామని, రాష్ట్రాలతో తమకు సంబంధం లేదని విదేశీ కంపెనీలు తేల్చిచెప్తున్నాయి. దీంతో విదేశీ కంపెనీల నుంచి రాష్ట్రాలకు డైరెక్ట్ గా వ్యాక్సిన్లు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. వ్యాక్సిన్ల సరఫరా కోసం పంజాబ్ ప్రభుత్వం ఫైజర్, మోడర్నా కంపెనీలను ఆశ్రయించగా ఆ కంపెనీలు నో చెప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వ రిక్వెస్ట్ ను కూడా అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలు మోడర్నా, ఫైజర్ తిరస్కరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి ఒప్పందాలు పెట్టుకోబోమని, కేంద్ర ప్రభుత్వంతోనే డీల్ చేసుకుంటామని మోడర్నా, ఫైజర్ కంపెనీలు రిప్లే ఇచ్చాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతేడాది డిసెంబర్లో ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలకు అమెరికా అనుమతిచ్చింది. మన దగ్గర ఇప్పటికీ వీటికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? ఇటీవల స్పుత్నిక్వికి మాత్రమే అనుమతిచ్చింది” అని అన్నారు. వ్యాక్సిన్ కొనుగోలుపై గ్లోబల్ టెండర్లు పిలుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలను తాము సంప్రదించినట్లు చెప్పారు. మోడర్నా, ఫైజర్లకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన అనుమతులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్ల ను ఆహ్వానించింది. కోటి డోసులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నెలకు 15 లక్షల నుంచి 20 లక్షల చొప్పున ఆరు నెలల్లో మొత్తం డోస్ లు సప్లయ్ చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. డబ్ల్యూహెచ్వో, డీసీజీఐ పర్మిషన్లు పొందిన వ్యాక్సిన్ సప్లయర్స్ ఇందులో పాల్గొనవచ్చని తెలిపింది. ఈ నెల 21 నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 4 తో గడువు ముగియనుంది. అయితే తాజాగా పంజాబ్, ఢిల్లీ రిక్వెస్టులను ప్రముఖ ఫైజర్, మోడర్నా కంపెనీలు తిరస్కరించడంతో మన రాష్ట్ర ప్రభుత్వ గ్లోబల్ టెండర్లపై సందిగ్ధత నెలకొంది