కరీంనగర్, మే 27,
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్ పై సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఆయన అడుగు ఎటు వేయాలన్న దానిపై స్పష్టత లేదు. అనవసరంగా టీఆర్ఎస్ అధిష్టానంతో కయ్యానికి దిగానా? అన్న ఆలోచన కూడా ఈటల రాజేందర్ లో బయలుదేరినట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెట్టడం, మరో పార్టీలో చేరడం కన్నా టీఆర్ఎస్ కే మళ్లీ చేరువకావడంపైనే ఈటల రాజేందర్ ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నది నిజమే కావచ్చు. టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు నిలబడలేకపోతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో బలహీనం అయిపోగా, బీజేపీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశాలున్నాయి. అయితే ఎంతవరకూ కొత్త పార్టీ తెలంగాణలో సక్సెస్ అవుతుందన్నదే ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని పెట్టి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఈటల రాజేందర్ ది ఆ పరిస్థితి కాదు.ఒకవైపు ప్రజల నాడి తెలుస్తూనే ఉంది. గతంలో దేవేందర్ గౌడ్ కొత్త పార్టీ పెట్టి మూసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసి విఫలమయ్యారు. కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కోదందరామ్ కంటే క్రేజ్, క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ఈటల రాజేందర్ కాదు. అది అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం అంటే చేతులు కాల్చుకోవడమేనని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. తనను కలసి రెచ్చగొట్టేవారు తర్వాత కన్పించరని కూడా ఈటల రాజేందర్ కు తెలియంది కాదు.ఇక కాంగ్రెస్ పూర్తిగా బలహీనమయింది. ఆ పార్టీలో చేరితే ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. కోదండరామ్ కు కాంగ్రెస్ ఇచ్చిన హ్యాండ్ గుర్తుండే ఉంటుంది. ఇక బీజేపీని కూడా నమ్మలేని పరిస్థిితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే పార్టీలో చేరడం కన్నా, ఉప ఎన్నిక అనివార్యమైతే స్వతంత్రంగానే పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. సమస్యలన్నీ రానున్న కాలమే పరిష్కరిస్తుందని, టీఆర్ఎస్ తిరిగి అక్కున చేర్చుకుంటే అటు వైపు వెళ్లడమే మంచిదని ఈటల రాజేందర్ కు కొందరు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈటల రాజేందర్ రాజీ పడక తప్పదంటున్నారు.