న్యూఢిల్లీ మే 27
ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది. యోగా గురు రాందేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ అరెస్ట్ రామ్ దేవ్ హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ట్విటర్ ట్రెండింగ్ కు పూనుకోవడంపై రాందేవ్ స్పందించారు. వారు ఏం చేసుకున్నా వారి తండ్రులు దిగొచ్చినా బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయలేరని వ్యాఖ్యానించారు. అల్లోపతి, అల్లోపతి వైద్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాందేవ్ పై దేశ ద్రోహం కింద కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఐఎంఏ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ పై ఆయన సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని కోరింది.వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా పదివేల మంది వైద్యులు మరణించారని ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఐఎంఏ మండిపడింది. కాగా తాను ఆధునిక వైద్య శాస్త్రం, అల్లోపతిని వ్యతిరేకించనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కు రాసిన లేఖలొ యోగ గురు వివరణ ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో కీలక సర్జరీలు చేపట్టి మానవాళికి సేవలందించడంలో అల్లోపతి మెరుగైన పురోగతి కనబరిచిందని తాము నమ్ముతున్నామన్నారు. వలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను తాను చదివివినిపించానని, తన వ్యాఖ్యలపై ఎవరైనా బాధపడిఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.