వాషింగ్టన్ మే 27
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్‌జోన్‌లోని పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యార్డ్‌లో ఘటన జరిగింది. ఘటనలో నిందితుడు సైతం మరణించాడని పోలీసులు తెలిపారు. కాంపౌండ్ లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్స్‌ను మోహరించినట్లు శాంట్లాకార్లా కౌంటీ షెరీఫ్ డెప్యూటీ రస్సెల్ డేవిస్ పేర్కొన్నారు. కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిందితుడిని వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ ఉద్యోగి 57 ఏళ్ల సామ్ కాసిడీగా గుర్తించారు. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఈ దుర్ఘటనపై వైట్‌హౌస్ డెప్యూటీ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియెర్ విచారం వ్యక్తం చేశారు.అధ్యక్షుడు చెప్పినట్లుగా.. దేశంలో తుపాకీ హింస అంటువ్యాధితో మేం బాధపడుతున్నామని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తుపాకీ నియంత్రణ సంస్కరణలను ఆమోదించాలని అమెరికా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు, ఫైర్ సిబ్బంది శాన్‌జోన్‌లోని రైలు యార్డుకు సమీపంలోకి భారీగా చేరుకున్నారు. సిలికాన్ వ్యాలీ టెక్ హబ్‌గా ఉన్న ఈ ప్రాంతంలో స్థానిక సమయం ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు జరిగాయని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు ముందు యూనియన్ సమావేశం జరిగిందని, ఆ సమయంలో కనీసం 80 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన వారంతా చికిత్స తీసుకుంటున్నారని శాన్‌జోస్ మేయర్ సామ్ లిక్కార్డో పేర్కొన్నారు.