అమరావతి మే 27
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై జులైలో సమీక్షిస్తామని ప్రభుత్వం పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ కరోనా కేసుల పెరుగుదల, కర్ఫ్యూ అమల్లో ఉండటంతో పరీక్షల నిర్వహణ సాధ్యసాధ్యాలపై సీఎం జగన్ ఇవాళ అధికారులతో చర్చించారు. అనంతరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.అంతకుముందు టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది. ఈ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ తరఫున న్యాయవాది తెలిపారు. దీనిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.