న్యూఢిల్లీ, మే 27,
కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న వారికిప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో కూడిన ధ్రువపత్రాలను జారీచేస్తున్న విషయం తెలిసిందే. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఈ ఫోటోలను తొలగించింది. తాజాగా, ఈ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటోను తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వ్యాక్సిన్ సర్టిఫికేట్ నుంచి మోదీ ఫొటోలను మూడో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జారీ చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పై ఇప్పుడు మిషన్ ఫతే లోగో మాత్రమే ఉంటుంది.వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉండటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మోదీ ఫొటోను తొలగించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఫోటోను తొలగించాలని తీసుకున్నట్లు సమాచారం. అలాగే కేంద్రం తగినన్ని వ్యాక్సిన్‌లు పంపకపోవడంతో పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి టీకాలు కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సినేషన్‌లో కేంద్రం నుంచి ఎటువంటి సహాయం లేకపోవడం కూడా మోదీ ఫొటోను తొలగించడానికి ఒక కారణంగా తెలుస్తోందిఇదిలా ఉండగా, దేశంలో వ్యాక్సిన్ల కొరతకు కేంద్రమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా బుధవారం ఫేస్‌బుక్‌లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, టీకాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఒక సాధనం కాకుండా తన ‘వ్యక్తిగత ప్రచారం’కోసం ప్రధాని నరేంద్ర మోదీ వాడుకుంటున్నారని ప్రియాంక ఆరోపించారు. వ్యాక్సిన్ల కోసం తయారీ సంస్థలను రాష్ట్రాలు సంప్రదించి నిరాశకు గురయినా కానీ, కేంద్ర ప్రభుత్వం అస్సలు చర్య తీసుకోలేదని ప్రియాంక విమర్శించారు.వ్యాక్సిన్ల సమకూర్చుకునే భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టేసి, సర్టిఫికెట్లపై మాత్రం ఫోటోలను వేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ల కొరతపై కేంద్రానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 15 ప్రసంగంలో వ్యాక్సినేషన్ ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన ప్రధాని.. ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు.