హైదరాబాద్, మే 27,
లంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం సీఎం విచారణకు ఆదేశించడంతో కేబినెట్ నుంచి ఈటల ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన ఇంకా పార్టీకి గాని, ఎమ్మెల్యే పదవికి కాని ఇంకా రాజీనామా చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్నాయి.ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఈటల వరుసగా సమావేశాలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్ని కలిశారు. దీంతో ఈటల కాంగ్రెస్‌లో లేక బీజేపీలో చేరుతారా? వేరేగా కొత్త పార్టీ పెడతారా? ఇలా అనేక రకాల సందేహాలు ఈటలపై నెలకొన్నాయి. అయితే ఆయనకు బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తోంది. ఈటల బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు, ఇటీవలే జరిగిన పరిణామాలు అందుకు మరింత బలం చేకూర్చాయి.రెండు రోజులుగా ఆయన బీజేపీ ముఖ్య నేతల్ని కలిశారు. ఇదిలావుంటే, రేపు ఉదయం ఎనిమిది గంటలకు మాజీ మంత్రి ఈటల శామీర్ పేటలోని ఆయన నివాసంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 2వ తేదీన ఎమ్మెల్యే పదవికి ఈటల రిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈటల దారి ఎటు వైపు అన్న సస్పెన్స్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొని ఉంది. ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆయన అనుచరులతో పాటు.. రాష్ట్ర ప్రజలు, రాజకీయ నేతలు ఆసక్తికరంగా ఎదరు చూస్తున్నారు.