YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల కోసం మహాకూటమి

ఎన్నికల కోసం మహాకూటమి

కడప, మే 28, 
బద్వేలు ఉప ఎన్నిక అనివార్యం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో అక్కడ ఎన్నిక ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. అయితే కోవిడ్ కారణంగా ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినా, ఎప్పటికైనా అక్కడ ఎన్నిక జరగాల్సిందే. అయితే అక్కడ వైసీపీ వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే టీడీపీ మాత్రం ఇక్కడ పోటీ చేయాలని అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో అక్కడ పార్టీ అభ్యర్థిపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. సర్వే ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గ్రిప్ ఉంది. అయితే కడప జిల్లాలో ఉండటం, ఉప ఎన్నిక కావడంతో వైసీపీకి అడ్వాంటేజీ ఉంటుందని తెలిసినా, చంద్రబాబు బద్వేలులో పోటీ చేయాలనే భావిస్తున్నారు.బద్వేలు నియోజకవర్గంలో టీడీపీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 1985, 1994, 1999, 2001లో వరస గెలుపులతో బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. 2004 నుంచి 2019 వరకూ మాత్రం టీడీపీకి గెలుపు అవకాశాలు దక్కలేదు. ఓటు బ్యాంకు, సరైన నేతలు ఉండటంతో ఈసారి పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్థానికనేతల అభిప్రాయంతో పాటు, సర్వే ద్వారా బద్వేలు టీడీపీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.అయితే ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేసే అవకాశముంది. మాజీ ఎమ్మెల్యే జయరాములును బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక జనసేన కు పెద్దగా అక్కడ ఓటు బ్యాంకు లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వామపక్షాలు, కాంగ్రెస్ తో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ తో నేరుగా పొత్తు లేకపోయినా అవగాహన కుదుర్చుకోవాలంటున్నారు. కమ్యునిస్టు పార్టీలను నేరుగా కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దీని ద్వారా 2024 ఎన్నికల కూటమికి ఒక దారి ఏర్పడుతుందన్నది చంద్రబాబు భావన. మరి ఓట్లే లేని ఈ రెండు పార్టీలను కలుపుకుని వెళితే చంద్రబాబుకు లాభం కంటే నష్టమేనన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Related Posts