చెన్నై, మే 28,
తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం పాలయింది. అయితే నేతల నిర్ణయంతో కీలకమైన పదవి కోల్పోయే అవకాశం ఏర్పడింది. రాజ్యసభలో అన్నాడీఎంకే మెజారిటీ తగ్గిపోనుంది. దీనికి కారణం అధినాయకత్వం నిర్ణయమేనన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వైద్యలింగం, కేపీ మునుస్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో అన్నాడీఎంకే బలం తగ్గనుంది. పార్లమెంటరీ పదవుల్లోనూ అన్నాడీఎంకేకు ఇకచోటు ఉండదు. ప్రస్తుతం అన్నాడీఎంకేకు రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులున్నారు. వారిలో మునుస్వామి, వైద్యలింగం ఎమ్మెల్యేలుగా గెలిచి రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అన్నాడీఎంకేకు రాజ్యసభలో బలం ఆరుకు పడిపోయింది. ఈ ఏడాది అక్టోబరులో గోపాలకృష్ణన్ రాజ్యసభ పదవీకాలం కూడా పూర్తికానుంది.దీంతో రాజ్యసభలో ఐదుకు అన్నాడీఎంకే బలం పడిపోనుంది. ఇక వచ్చే ఏడాది జూన్ కు మరో ముగ్గురు పదవీ కాలం ముగియనుంది. అప్పడు రాజ్యసభలో ఇద్దరు మాత్రమే అన్నాడీఎంకే సభ్యులు ఉంటారు. అయితే వచ్చే ఏడాది మొత్తం ఐదు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. వాటిలో శాసససభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం డీఎంకేకు మూడు, అన్నాడీఎంకేకు రెండు పదవులు దక్కుతాయి. అంటే రాజ్యసభలో అన్నాడీఎంకే నాలుగు స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది.ఐదు స్థానాలు ఉంటేనే పార్లమెంటరీ కమిటీల్లో చోటు దక్కుతుంది. రాజ్యసభలో జరిగే చర్చల్లోనూ కొంత సమయాన్ని కేటాయించే అవకాశముంది. కానీ అన్నాడీఎంకేకు వచ్చే ఏడాది నాటికి నలుగురు సభ్యులు మాత్రమేరాజ్యసభలో మిగులుతారు. రాజ్యసభకు రాజీనామా చేసిన వైద్యలింగానికి ఏడాదిమాత్రమే సమయం ఉంది. కానీ మునుస్వామికి ఐదేళ్ల పదవీకాలం ఉంది. ఐదేళ్ల పదవీకాలం ఉన్నా రాజ్యసభకు రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఒక్క ఛాన్స్ ను అన్నాడీఎంకే కోల్పోయినట్లయింది.