హైదరాబాద్, మే 28,
ఇటీవల మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఆమోదం లభించింది. బీజేపీలో ఈటల రాజేందర్ చేరే అంశంపై తెలంగాణ బీజేపీ సహా జాతీయ స్థాయి కీలక నేతలతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చర్చలు జరిపారు. వీడియో కాల్ ద్వారా బండి సంజయ్ సహా వివిధ నేతలతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బండి సంజయ్ సహా, మిగిలిన నేతలు ఈటల చేరే అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ క్రమంలో ఈటల రాజేందర్‌కు కాషాయ తీర్థం ఇచ్చేందుకు చేరికకు బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఇక బీజేపీలో ఆయన చేరే తేదీని మరో రెండు రోజుల్లో బీజేపీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ఈటల రాజేందర్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అక్కడే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కొద్దిరోజులుగా తెలంగాణలో బీజేపీ కీలక నేతలతో ఈటల రాజేందర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్‌తో కూడా ఈటల సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి టీఆర్ఎస్‌కు సవాలు విసిరే ఆలోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం.