YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ

వాయిదా  ‘తలపెట్టిన కార్యాన్ని తక్షణమే పూర్తి చేయమని, భవిష్యత్తులో  నిర్వహించాల్సిన  కార్యాన్ని వర్తమానంలోనే ముగించాలని, వాయిదాలు వేయడం వలదని’ పెద్దల మాట. న్యాయస్థానాలలో ఇచ్చే గడువు,  బీమా చెల్లింపు కిస్తులను  వాయిదాగా పిలవడం పరిపాటి.   
​మానవుడి మస్తిష్కం ఆలోచనల పుట్ట. నిరంతరం అల్లుకునే అంతులేని ఆలోచనలకు తుదిరూపు ప్రసాదించేందుకు ప్రణాళికలు వేస్తూ,  అమలు కొరకై  శుభ దినం, శుభ ముహూర్తాల కోసం వేచి చూడడం అలవాటు. ఏదీ లోకంలో  శాశ్వతం కాదని, శుభముహూర్తం సమీపించే లోపు  ఊహించని రానిదేదైనా జరగవచ్చునని, తలపెట్టిన కార్యం జరుగకపోవచ్చునని,  తక్షణమే ప్రారంభించడం ఉత్తమమని అనుభవజ్ఞులు సూచిస్తారు.   
​సత్కార్యం తలపెట్టేవారు వాయిదాలు వెయ్య కూడదని తెలిపే కథలను పురాణాలు వివరించాయి. ఒకసారి పాండవాగ్రజుడి గృహంలో  శుభకార్యం జరుగుతుండగా  దానాన్ని యాచిస్తూ ధర్మరాజు ముందు నిలిచాడొక  బ్రాహ్మణుడు. ఆ క్షణాన  తీరిక లేనందున  బ్రాహ్మణుడిని తదుపరి దినం కలవమన్నాడు ధర్మరాజు. అది విన్న భీముడు ‘దానమిచ్చే యోచన ఉంటే  తక్షణమే ఇవ్వు. వాయిదా వలదు. మరునాటికి ఇద్దరిలో ఎవరు లేకపోయినా దానం  కుదరదని’ చెప్పడంతో  బ్రాహ్మణుడికి దానమిచ్చి పంపాడు ధర్మరాజు. మహాబలశాలిగా  పేరున్న భీముడి వివేకాన్ని తెలిపే కథ ఇది. 
భారతంలో దానకర్ణుడిగా కీర్తి గడించిన కర్ణుడి  గృహానికి శ్రీకృష్ణుడు విచ్చేశాడు ఒకసారి. ఆ సమయంలో అభ్యంగన స్నానానికి సిద్ధమవుతున్నాడు కర్ణుడు. అతడి ఎడమ చేతిలోని రత్నాలు పొదిగిన నూనె గిన్నెను చూసిన కృష్ణుడు “బహుముచ్చటగా ఉంది. కానుకగా ఇస్తావా?” అని అడిగాడు. తక్షణం ఆ  గిన్నెను కృష్ణుడి చేతికి అందించాడు కర్ణుడు.
ఆశ్చర్యపోయిన కృష్ణుడు “ఎడమచేత్తో ఇచ్చే బదులుగా కుడిచేత్తో  ఇవ్వరాదా?”  అని ప్రశ్నించగా, ‘ఎడమ చేతిలోని గిన్నెను కుడిచేతికి మార్చే లోపు  ఏమి జరుగుతుందో  తెలియదు. చంచలమైనది లక్ష్మి. దయలేనివాడు యముడు. మనసు ఎప్పుడెలా మారుతుందో చెప్పలేము.  ధర్మకార్యాన్ని వాయిదా వెయ్యకుండా తక్షణమే చెయ్యాలనే హితోక్తి ననుసరించి అలా చేశానని’ బదులిచ్చాడు కర్ణుడు. కర్ణుని వివేచనకు ఎంతగానో సంతోషించాడు కృష్ణుడు.
“సత్కార్యం యోచించేవారు  తక్షణమే ఆరంభించాలని, చెడు తలంపు కలిగితే వాయిదా వెయ్యడమే ఉత్తమమని, కాలం గడుస్తున్న కొద్దీ చెడు తలంపు దూరమై సద్భుద్ది కలగవచ్చునని” పెద్దలు చెప్పినట్టు సత్కార్యాలకు ముందడుగు వేస్తూ  సమాజ ప్రగతికి దోహదపడే విధంగా సర్వ జనహితాన్ని కాంక్షిస్తూ జీవించడమే కాకుండా  ఎప్పటి కార్యాలు అప్పుడే పూర్తి చేయడం అలవరచుకోవాలి.

వరకాల మురళీమోహన్ గారి  సౌజన్యంతో 

Related Posts