శ్రీ గురుభ్యోన్నమహ
శ్రీ గణేశాయనమః
జగద్గురు శంకరాచార్య పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ప్రసంగములనుంచి, మా గురువుగారి వివరణల నుంచి సంకలనం చేసినది....
శివం అంటే మంగళం, "శ్వశ్రేయం శివం భద్రం కళ్యాణం, మంగళం శుభం" అని అమరకోశం వ్యాఖ్యానిస్తోంది.అట్టి పరమమంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయాలనుక్కునేవారు చేయవలసినదేమిటి?
→మొదట విభూతి ధారణ, విభూతి అనగా ఐశ్వర్యం. అది అగ్నిలో కాలి శుద్ధమైన చిట్టచివరి సత్య వస్తువుగా మిగులుతుంది ( ఏ వస్తువుని కాల్చినా మిగిలేది బూడిదే, బూడిదని కాల్చినా మిగిలేది బూడిదే అదే ఆ వస్తువు యొక్క సత్స స్వరూపం). ఆ విభూతిని శివుడు ఒంటినిండా అలదుకుంటాడు. అంటే సృష్టి వ్యూహ రహస్యాన్ని అంతా వీభూతి కణాలలో కూర్చి దానిని తన శరీరానికి అలదుకుని కాపాడతాడు. అంతా బూదిగా మారినా దాన్ని తనకలంకారంగా పూసుకుని తానుమాత్రం అలానే ఎకంగా తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. విభూతి సూచించే ఇంకో విషయం ఏంటంటే కాలం లో వచ్చినది కాలంలో కలిసిపోయి కాలానికతీతుడైన ఆ పరబ్రహ్మను పట్టుకుని ఆయనలోచేరిపోతుంది. ఆయనే కాలాతీతుడు పరబ్రహ్మము అని తెలుస్తుంది....
→రెండవది రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష అంటే శివుని కళ్ళ నుండి పుట్టినది. సాక్షాత్ ఆయన మూడవ కన్ను స్వరూపం. దేవతలలో మూడు కన్నులున్న దేవుడు ఈయనే. మూడవకన్ను అగ్నికి ప్రతీక అంటే జ్ఙానాగ్నికి ప్రతీక. సృష్ఠిలో రుద్రాక్ష వంటిది మరొక లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంక ఏ కాయకి, పండుకి, గింజకీ దేనికీ ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తినీ ప్రయోగించి రంధ్రము చేయనవసరంలేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడా మన సంసారంలో ఉన్నా జీవనాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్యమైనదానిగా గడపాలని సూచిస్తుంది....
→మూడవది పంచాక్షరీ మంత్ర జపం. పంచాక్షరీ జపం మంత్ర దీక్షలేని వారు శివ శివ అని జపం చేయాలి. విద్యానుశ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇ త్యక్షరద్వయమ్!! వేదములలో ఉత్కృష్టమైనది మధ్యలోనున్న మేలుబంతి వంటిది యజుర్వేదం. ఆ యజుర్వేదంలో నాలుగవ కాండ ఇంకా ప్రశస్తం. ఆందులోని రుద్ర ప్రశ్నలో మధ్యలోని పంచాక్షరి ఇంకా గొప్పది. ఆ పంచాక్షరిలోని శివ అను అక్షరద్వయం జీవద్వయం. అని శ్రీ అప్పయ దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో చెప్పారు. →నాలుగవది మారేడు దళములతో పూజ. లక్ష్మీదేవి ఐదు స్థానాలలో ఎక్కువగా ఉంటుంది. అవి మారేడు, ఆవు వెనక తట్టు, స్త్రీల పాపట, ఏనుగు కుంభస్థలము, పద్మము. అందుచేత మారేడుచే శివపూజ అత్యంత ముఖ్యం అంతేకాదు మారేడుతో పూజ ఐశ్వర్యాన్ని, జ్ఙానాన్నీ కూడా కలుగజేస్తుంది.→ఐదవది ధ్యానం, హృదయంలో సదా శివ ధ్యానం చేస్తూ వెలుపలి పూజతోపాటు శివస్వరూపానుసంధానం ఎడతెగకుండా చేయాలి అదే అభిషేకం....
సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదీష సమయంలో శివ స్మర్ణ విధిగా చేయాలి కనీసం ఐదు నిమిషాలైనా చేస్తానని సంకల్పించి మానసికంగా స్మరణమూ వాచికంగా శివనామోచ్చారణా చేస్తే ఆత్మోన్నతి కలుగుతుంది.ఏ సందేశమైనా, లేదా సాక్ష్యమైనా మరణ సమయంలో ఇచ్చినది నిక్కచ్చి. భాగవతం అంతటికీ మేలు బంతి దక్ష యజ్ఙ ధ్వంసం. భాగవతం సందేశం. శివనింద చేయరాదన్నదే అని పెద్దల వాక్కు. సతీదేవి శరీర త్యాగం చేసి శివుని ద్వేషించిన, అటువంటి వారిని ప్రోత్సహించిన వారి గతిఏమో చూపించింది. శివుడొద్దన్నవానికి మంగళమెక్కడిది?
పాపాన్ని ఒకే ఒక్క కోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉంది. దానికోసం అన్ని చోట్లా వెతకక్కరలేదు. వేదాలకు జీవరత్నము, దేహానికి ప్రాణమూ, దేవాలయమునకు మహా లింగము వలె వెలుగుతున్న శివ అనే రెండు అక్శరాలు పాపాలన్నీ పటాపంచలు చేసే పరమౌషధం. మానవునిగా పుట్టి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుక్కునేవారికి శివనామోచ్చారణమే శరణ్యము. ఆ పరమేశ్వరుడు మనకి నాలుక వాక్కు ఇచ్చినందుకు పంచాక్షరిని ఉపదేశం లేకపోతే శివ శివ అని జపం చేయడమే మన విధి.
అపి వా య శ్చాండాలః శివ ఇతి వచం విసృజేత్ తేన సహ సంవసేత్..
ఛండాలుడంటే ఏ విధీ లేక అన్ని సంస్కారాలనూ వదిలి చాతుర్వర్ణాలనూ వదిలి ఉన్నవాడు. శివుడు సర్వ జగత్తుకు తండ్రి. మంచి వారికీ తండ్రి అలాగే చెడ్డవారికీ. దేవతలకూ దానవులకూ కూడా వారు తల్లి తండ్రులు.. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ... అందుకే ఛండాలుడు ఉద్దరింపబడడానికి శివ నామ జపం విధిగా నియమింప బడింది. అంటే ప్రతి ఒక్కరూ శివ నామ జపం చేయాలి.
యాతే రుద్ర శివాతనూరా ఘోరపాపకాశినీ
తయా నస్తను వా శంతమయ గిరిశం తాభిచాకాశీహి
యాతేరుద్ర శివ తనూః శివా విశ్వాహ భేషజీ
శివారుద్రస్య భేషజీ తయానో మృడ జీవసేః
ఆ పరమేశ్వరుడు భక్తులకు అతి మంగళ కరుడు, భక్తులపాలికి వచ్చినవారికి కంకాళాదులతో ఘోరరూపి. ఆయన అహం స్ఫురణ ప్రాణమే అంబిక. ఆయన మంగళ కరుడు ఆవిడ సర్వ మంగళ.
శాస్త్రం శారీర మీమాంసా దేవః శ్రీ చంద్ర శేఖరః
గురుః శ్రీ శంకరాచార్యః నంతుమే జన్మజన్మని!!
ఎన్ని జన్మలకూ నాకు చంద్ర శేఖరుడైన సాంబశివుడే స్వామి. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులే గురువులు. ఏజన్మ ఎత్తినా ఏ అవస్థలో ఉన్నా శివ నామస్మరణమే శాంతి కారకము.
ఓం నమః శివాయ