ఆంధ్రప్రదేశ్ కు మట్టి, నీరు ఇచ్చి పోయిన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షనేత వైఎస్ జగన్ నిలదీయలేకపోయారంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలో వైకాపా 'వంచన దీక్ష' ప్రారంభం సందర్బంగా రోజా ప్రసంగించారు. నరేంద్ర మోదీ వచ్చి మట్టి, నీరు ఇచ్చిన వేళ, జగన్ అక్కడ లేరని, వాటిని రెండు చేతులతో మహా ప్రసాదంగా తీసుకున్న చంద్రబాబు ఓ దద్దమ్మ అయితే, ఆయన పక్కనే ఉన్న దేవినేని మరో దద్దమ్మని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్న వేళ, ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా వాళ్లింటి పేరంటంలా చేసుకుని సిగ్గు లేకుండా ప్రవర్తించిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.నాడు మట్టి, నీటిని కళ్లకు అద్దుకుని హెలికాప్టర్ ఎక్కి చంద్రబాబు చల్లుతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ వారు చేసిన పాపాలు పండే సమయం వచ్చిందని రోజా అన్నారు. చంద్రబాబు చేసిన కుంభకోణాల్లో ఏ ఒక్కటి విచారణకు వచ్చినా, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.వంచన చేసిన వారే ధర్మపోరాటం అంటూ మరో కుట్రకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకు జరుపుతున్న చంద్రబాబు మోసపు దీక్షల గురించి ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డిలతో పాటు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కాగా, రాత్రి 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది.