YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీకృష్ణకు కలిసి రాని కాలం

వంశీకృష్ణకు కలిసి రాని కాలం

విశాఖపట్టణం, మే 29, 
దురదృష్టం పట్టుకునే ఏళ్ళూ ఊళ్ళూ దోస్తీ చేస్తుంది అంటారు. అదే అదృష్టం అయితే మెరుపు తీగలా ఇలా వచ్చి అలా మాయం అవుతుంది అని చెబుతారు. కొందరికి మాత్రం బ్యాడ్ లక్ అలా పట్టుకుంటే అసలు వదలదు. పైగా జీవితకాలం వాలిడిటీ అంటూ భారీ ఆఫర్లు కూడా ఇచ్చేసి మరీ రెచ్చగొడుతుంది. ఇపుడు వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయం కూడా అలాగే ఉంది. మేయర్ కావాల్సిన పెద్ద మనిషిని జస్ట్ కార్పోరేటర్ గా ఉంచిందంటే ఆయనకు పట్టిన బ్యాడ్ లక్ కి గిన్నీస్ అవార్డ్ ఇవ్వాల్సిందే.వంశీక్రిష్ణ శ్రీనివాస్ మనిషి మంచివాడు. ఆయనకంటూ వర్గాలు లేవు. పైగా ఆయన బాగుపడాలని అంతా కోరుకుంటారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కి అయితే వంశీక్రిష్ణ శ్రీనివాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం. మరో వైపు చూస్తే విశాఖలోని విజయసాయిరెడ్డికి వంశీ మీద ప్రేమ చాలా ఉంది. పైగా ఆయనకు ఏ పదవీ దక్కడంలేదని సానుభూతీ ఉంది. ఇలా అందరూ నీవు బాగుండాలయ్యా అని దీవిస్తున్నా కూడా పదవీ పట్టాభిషేకం మాత్రం యుగాలూ జగాలూ అయినా జరగడంలేదన్నదే అనుచరుల బాధ. నిజానికి తమ నేతకు పదవి ఎందుకు రావడం లేదు అంటే వారు కూడా సరైన జవాబు చెప్పలేని స్థితి.ఫిబ్రవరిలో మేయర్ కావాల్సిన వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి పెద్ద షాక్ లా వైసీపీలో రాజకీయ సామాజిక సమీకరణలు దాపురించాయి. ఆ మీదట జగన్ ని కలిస్తే భారీ అభయం ఇచ్చేశారు. ఇక విజయసాయిరెడ్డి సైతం వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి త్వరలో మంచి పదవిలో చూడబోతున్నామని ప్రకటించేశారు. ఆయన్ని రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ కి చైర్మన్ గా నియమిస్తారు అని అంతా అనుకున్నారు. నిజానికి అది జరిగేదేమో. ఈలోగా కరోనా రెండవ విడత పెద్ద ఎత్తున దూసుకురావడంతో వంశీకి దక్కాల్సిన పదవి మళ్ళీ జీవిత కాలం లేట్ అయ్యేలా ఉంది అంటున్నారు. గత ఏడాది కరోనా లేకపోతే వంశీక్రిష్ణ శ్రీనివాస్ కచ్చితంగా మేయర్ అయ్యేవారు అని ఇప్పటికీ ఆయన అభిమానులు తలచుకుంటారు. వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఈసారి భార్యాసమేతంగా విజయసాయిరెడ్డిని కలసి తన వినతులు చెప్పుకున్నారు. వైసీపీలో మీ చొరవతో అందరికీ పదవులు దక్కాయి. మిగిలిన వారికి కూడా ఇస్తే న్యాయం జరుగుతుంది అంటూ తన గురించి కూడా గుర్తు చేసి వచ్చారు. మరి జగన్ తో విజయసాయిరెడ్డి వంశీక్రిష్ణ శ్రీనివాస్ విషయం గుర్తు చేసి అయినా ఆయనకు పదవి ఇప్పించే బాధ్యతను తీసుకోవాలని అంతా కోరుతున్నారు. అయితే ఇపుడు కరోనా రెండవ దశ తగ్గేవరకూ మరో ఊసు తలవకూడదని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే నామినేటెడ్ పదవుల భర్తీని కూడా ఆపారని తెలుస్తోంది. కరోనా ఎపుడు తగ్గేనో జగన్ మనసు నామినేటెడ్ పదవుల మీదకు ఎపుడు మళ్ళేనో చూడాలి. మొత్తానికి బ్యాడ్ లక్ అంటే మరీ ఇంతలా ఉంటుందా వంశీక్రిష్ణ శ్రీనివాస్ అని తోటి వారే అనేంతగా ఈ విశాఖ‌ నేత సీన్ ఉందిట.

Related Posts