గుంటూరు, మే 29,
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు అయినప్పటిం నుంచి ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆయనకు మద్దతుగా ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఆయన అరెస్టుపై అనేక ట్విస్టుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ ఆయన ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. దీంతో అసలు ఆయనకు ఏమైంది అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కస్టడీలో ఉన్నప్పుడు ఆయన్ను కొట్టారా లేదా దానిపై మొదట సీఐడీ కోర్టు, తరువాత హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టుల్లో విచారణ జరిగినా.. సరైన సమాధానం రాలేదు. కానీ ఏపీ సీఐడీ పోలీసులకు మాత్రం ఈయన అరెస్టులో వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రఘురామకు బెయిల్ ఇవ్వొద్దంటూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ గట్టిగా వాదనలు వినిపించినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మరో షాక్ తగిలింది. కస్టడీలో రఘురామను కొట్టారని ఆయన కుమారుడు ఫిర్యాదు చేయడంతో ఎన్‌హెచ్ ఆర్సీ రంగంలోకి దిగింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఆర్మీ ఆస్పత్రి నివేదికలో కొట్టినట్టు ఉండటంతో ఇప్పుడు సీఐడీ చిక్కుల్లో పడింది. ఇలా సీఐడీ పోలీసులకు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.