YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

స్టాలిన్ తో సయోధ్యకు అళగిరి ప్రయత్నాలు

స్టాలిన్ తో సయోధ్యకు అళగిరి ప్రయత్నాలు

చెన్నై, మే 29, 
కరుణానిధి కుమారుడు స్టాలిన్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రికోరికను ఆయన నెరవేర్చారు. అన్నాడీఎంకేేపై విజయం సాధించి స్టాలిన్ తన తండ్రి పేరును నిలబెట్టారు. అదే సమయంలో మరో కుమారుడు ఆళగిరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఆళగిరి తిరిగి డీఎంకేకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కుటుంబ సభ్యుల ద్వారా తన ప్రయత్నాలను చేస్తున్నట్లు చెబుతున్నారు.ఆళగిరి కరుణానిధి జీవించి ఉన్నప్పటి నుంచే స్టాలిన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. కరుణానిధి మరణించిన తర్వాత డీఎంకేలో కీలక పదవి పొందేందుకు ఆళగిరి ప్రయత్నించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ద్వారా వత్తిడి తెచ్చారు. అయినా స్టాలిన్ అంగీకరించకపోవడంతో ఆళగిరి కొత్త పార్టీ పెడతానని బ్లాక్ మెయిలింగ్ కు కూడా దిగారు. అయినా స్టాలిన్ అంగీకరించలేదు.రజనీకాంత్ పార్టీ పెడితే అందులో చేరాలని ఆళగిరి భావించారు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఫలితాలను ముందుగానే అంచనా వేసిన ఆళగిరి ఈ ఎన్నికల్లో మౌనంగా ఉండటమే బెటరని భావించారు. అయితే ఎన్నికలు పూర్తయి సోదరుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. విపక్షాలను కూడా స్టాలిన్ కలుపుకుని పోతున్నారు.ఈ నేపథ్యంలో ఆళగిరి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన కుమారుడికి డీఎంకేలో అవకాశం ఇవ్వాలని ఆళగిరి కోరుతున్నట్లు తెలిసింది. దగ్గరి బంధువుల ద్వారా స్టాలిన్ దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకు వెళ్లారంటున్నారు. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ కల్పించాలని ఆళగిరి చేస్తున్న ప్రతిపాదనను స్టాలిన్ కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆళగిరి తిరిగి తన వారసుడిని డీఎంకేలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts